అక్షరటుడే వెబ్‌డెస్క్: Madanapalle Land Grab | ఫోర్జరీ పత్రాలు, నకిలీ రికార్డులతో విలువైన స్థలాలను ఆక్రమిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న మదనపల్లెకు చెందిన రౌడీషీటర్, ‘లేడీ డాన్’ కోనేటి సులోచనతో పాటు ఆమె ప్రధాన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లె సబ్‌జైలులో ఉన్న సులోచన సహా ముగ్గురిని పీటీ (PT) వారెంట్‌పై అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు మదనపల్లె టూటౌన్ ఎస్ఐ నాగేశ్వర్రావు వెల్లడించారు.
Madanapalle Land Grab | కేసు వివరాలు..
మదనపల్లెకు చెందిన బాధితుడు మార్పూరి శ్రీరామ్‌కు చెందిన భూమిని, అతని పెద్దనాన్న కుమారుడు మార్పూరి వెంకటేష్ 2023లోనే రాసిచ్చినట్లు నిందితులు నకిలీ పత్రాలు సృష్టించారు. ఆ తర్వాతి కాలంలో వైఎస్సార్ కడప జిల్లా ( Kadapa )పులివెందుల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ దొంగ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం సదరు స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి, అక్కడ ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి భూమిని ఆక్రమించుకున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Madanapalle Land Grab | పీటీ వారెంట్‌పై అరెస్ట్..
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటికే వేర్వేరు కేసుల్లో మదనపల్లె సబ్‌జైలులో ఉన్న కోనేటి సులోచన, ఆమె అనుచరుడు గుండిగల మోహన్, రెడ్డెప్పనాయుడు కాలనీకి చెందిన రియల్టర్ కడియాల శ్రీరాములు నాయుడులను పీటీ వారెంట్ ద్వారా అరెస్టు చేశారు. అనంతరం వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. ఈ భూ ఆక్రమణ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు.
కాగా, ప్రధాన నిందితులైన కోనేటి సులోచన, కడియాల శ్రీరాములునాయుడులపై ఇప్పటికే పలు క్రిమినల్, భూ ఆక్రమణ కేసులు ఉన్నాయని, సులోచన గతంలో కూడా జైలుకు వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: RTC Metro Common Pass | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గనున్న ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్ ధరలు