అక్షరటుడే, వెబ్‌డెస్క్: Madras High Court | అక్రమ కార్యకలాపాలపై అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమైనప్పుడు, ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నందుకు వారిని నిందించవచ్చా అని మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
తమిళనాడు (Tamil Nadu)లోని శివగంగై జిల్లాలో ఒక చెరువు సమీపంలో అనుమతులు లేకుండా ఓ సంస్థ సిమెంట్ పైపులు, రోడ్డు వేసింది. అయితే వాటిని కొందరు ధ్వంసం చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు హైకోర్టుకు రాగా.. జస్టిస్‌లు జి.ఆర్. స్వామినాథన్, బి. పుగలేందిలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
Madras High Court | ఆందోళన చేసినా..
సదరు సంస్థ అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆందోళన చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. చెరువులో నుంచి రోడ్డు వేయడంతో వరద నీరు రావడానికి అడ్డుగా ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో గ్రామానికి చెందిన నటరాజన్, జేవియర్ కెన్నెడీ సిమెంట్ పైపులను ధ్వంసం చేశారు. దీంతో సెప్టెంబర్ 23న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. జిల్లా కోర్టు వారికి బెయిల్ ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.
Madras High Court | వారి చర్యను సమర్థించలేం
అధికార యంత్రాంగం విఫలమైనప్పుడు, పౌరులు తమంతట తాముగా చర్యలు తీసుకున్నందుకు వారిని నిందించగలమా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే, గ్రామస్థుల చర్యలను తాము సమర్థించలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.కానీ ఆ ఇద్దరు వ్యక్తులను నిర్బంధంలో కొనసాగించడం సమర్థనీయం కాదన్నారు. వారి బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని సెషన్స్ కోర్టును ఆదేశించారు.
ఇది కూడా చదవండి..: Jio Platforms IPO | జియో ఐపీవో ప్రైస్ బ్యాండ్ లీక్!..