అక్షరటుడే వెబ్‌డెస్క్: Mahalaya Amavasya 2026 |హిందూ ధర్మంలో పూర్వీకులను స్మరించుకుని, వారి రుణాలు తీర్చే పవిత్ర కాలమే పితృపక్షం. ఈ ఏడాది సెప్టెంబర్ 27న ప్రారంభమైన పితృపక్షాలు అక్టోబర్ 10, శనివారంతో ముగియనున్నాయి. ఈ ఆఖరి రోజునే అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘మహాలయ అమావాస్య’ (పెతరమాస) అంటారు. సంవత్సరం పొడవునా పితృదేవతల మరణ తిథుల రోజున శ్రాద్ధం పెట్టలేని వారికి, లేదా అసలు తిథి ఎప్పుడో తెలియని వారికి ఈ ఒక్క రోజే పితృ రుణాలు తీర్చుకోవడానికి చివరి , అత్యవసరమైన అవకాశంగా శాస్త్రాలు చెబుతున్నాయి.
Mahalaya Amavasya 2026 | ఆధ్యాత్మిక నేపథ్యం..
పూర్వీకులను పూజించే ఈ సంప్రదాయం మనకు వేద కాలం నాటి నుంచే వస్తోంది. ఋగ్వేదంలో పితృదేవతలను కీర్తించే ప్రత్యేకంగా ‘పితృ సూక్తం’ ఉంది. శ్రాద్ధ విధివిధానాలను గృహ సూత్రాలు వివరించగా, ఎవరు చేయాలి, ఏ తిథిన చేయాలి అనే నియమాలు మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి వంటి ధర్మశాస్త్ర గ్రంథాలలో స్పష్టంగా కనిపిస్తాయి. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుక్ల పక్షం పాడ్యమి వరకు ఉండే ఈ 16 రోజుల కాలాన్ని మహాలయ పక్షం లేదా మహాలయ అమావాస్యగా పిలుస్తారు.
ధర్మశాస్త్రాల ప్రకారం.. వర్షాకాలంలో వచ్చే ఈ అమావాస్య రోజున పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పితృ దేవతలు వాయు రూపంలో, చీకట్ల సహాయంతో తమ సంతతిని సులభంగా సమీపిస్తారని నమ్మకం. కుటుంబ సభ్యులు తమ ధర్మాన్ని, సంప్రదాయాలను సక్రమంగా పాటిస్తున్నారో లేదో పరిశీలించడానికి వారు వస్తారని, పాటిస్తే సంతృప్తితో ఆశీర్వదించి, లేకపోతే నిరాశతో వెనుదిరుగుతారని శాస్త్ర వచనం.
Mahalaya Amavasya 2026 | మహాలయ పక్షాల ప్రాముఖ్యత..
చాలా మందికి కాశీ, గయ, ప్రయాగ, రామేశ్వరం వంటి దివ్యక్షేత్రాలలో ( Temples )తర్పణాలు విడిచిపెట్టినా, వార్షిక శ్రాద్ధ కర్మలు చేసినా మహాలయం చేయాలా అనే సందేహం ఉంటుంది. అయితే అటువంటి వారు కూడా ఈ పక్షంలో తప్పనిసరిగా శ్రాద్ధ విధిని పాటించాలని శాస్త్రం చెబుతోంది. సాధారణ తిథి ఆధారిత శ్రాద్ధ కర్మలు కేవలం నిర్దిష్ట పితృదేవతలకు మాత్రమే చెందుతాయి. కానీ మహాలయం అనేది సమస్త బంధుగణానికి, మానవ కోణంలో తెలిసి తెలియక మిగిలిపోయిన పూర్వీకులందరికీ కృతజ్ఞతాపూర్వకంగా నువ్వులు, నీళ్లతో తర్పణం సమర్పించే మహా వేడుక.
Mahalaya Amavasya 2026 | దౌహిత్రిక మహాలయం విశేషాలు..
మహాలయ అమావాస్య రోజే ఈ పర్వదినం పూర్తికాదు. కొడుకులు లేని కుటుంబాలలో కుమార్తెలకు కుమారులు (దౌహిత్రులు) కలిగిన వారు, ఆ మరణించిన తాతకి, బామ్మకి ఆశ్వయుజ శుక్లపక్షం పాడ్యమి నాడు నిర్వహించే ఆబ్దిక రూపమైన మహాలయాన్నే ‘దౌహిత్రిక మహాలయం’ అంటారు. ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా బ్రాహ్మణులకు బియ్యం, పెసరపప్పు, బెల్లం, కూరగాయలు వంటి దానాలు అందించడం లేదా శ్రాద్ధం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఏ విధంగా చేసినా పితృ పక్షాలను విధిగా పాటించి, పితృదేవతల ఆశీర్వాదాలను పొంది సనాతన ధర్మాన్ని ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: 12 Hours Free Power | 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలి