Maruti Production | ‘మారుతి’ మరో రికార్డు.. ఏడాదిలో 23.4 లక్షల కార్ల ఉత్పత్తి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Maruti Production | ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన మారుతీ సుజుకీ (Maruti Suzuki) మరో అరుదైన మైలురాయిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేయడం ద్వారా ఏడాదిలో ఇన్ని కార్లు తయారుచేసిన ఏకైక కంపెనీగా ఆవిర్భవించింది. దేశీయ మార్కెట్‌ (Domestic Market)లో 18.61 లక్షల యూనిట్లు విక్రయించగా.. 4,47,774 యూనిట్లను ఎగుమతి చేసింది. కంపెనీ అమ్మకాలు ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన దాదాపు 16.72 శాతం పెరిగాయి.

Maruti Production | 40 లక్షల యూనిట్లకు పెంచడమే లక్ష్యంగా..

ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయిలో కార్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఒక్క మారుతీ సుజుకీ మోటార్ కార్పొరేషన్ కే ఉందని కంపెనీ పేర్కొంది. వివిధ సెగ్మెంట్లలో ప్రత్యేకించి హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, ఎస్ యూవీలకు వినియోగదారుల నుంచి లభించిన ఆదరణతో రికార్డు స్థాయిలో కార్లను ఉత్పత్తి చేయగలిగామని, ప్రభుత్వ విధాన నిర్ణయాలు, జీఎస్టీ 2.0 కూడా కలిసొచ్చాయని తెలిపింది. ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచడంతో పాటు భారత్‌ను ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

Maruti Production | అత్యధికంగా ఉత్పత్తి అయిన కార్లివే..

మారుతి సుజుకీ దేశీయంగా 17 రకాల మోడళ్లను 650 వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. వీటిని దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ విక్రయిస్తోంది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో ఆల్టో, ఎస్‌ప్రెస్సో వంటి కార్లు, కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్ , ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగనఆర్ వంటి మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. యుటిలిటీ వాహనాల్లో బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, ఎక్సఎల6 బలమైన వృద్ధిని నమోదు చేశాయి.

ఇది కూడా చదవండి..: Stock Market | రెండో రోజూ నష్టాలే..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *