అక్షరటుడేవెబ్‌డెస్క్: Mukesh Ambani Wealth | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యధికంగా సంపదను పెంచుకున్న బిలియనీర్‌గా సరికొత్త రికార్డు సృష్టించారు. రిలయన్స్ షేర్ల విలువ స్టాక్ మార్కెట్లో దూసుకుపోవడంతో కేవలం ఒకే రోజులో ఆయన సంపద రూ.50,400 కోట్లకు పైగా పెరిగింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం, ఆయన నికర ఆస్తి 7.85 శాతం పెరిగి ఏకంగా రూ.52,920 కోట్ల వృద్ధిని నమోదు చేసింది.
Mukesh Ambani Wealth | కుబేరుల రేసులో అంబానీ..
ఈ భారీ లాభంతో ముఖేష్ అంబానీ మొత్తం సంపద రూ.7,45,920 కోట్లకు చేరింది. ప్రస్తుతం ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలో 23వ స్థానంలో కొనసాగుతున్నారు. కాగా, గౌతమ్ అదానీ రూ.6,64,608 కోట్ల సంపదతో 26వ స్థానంలో నిలిచారు. అంబానీ తర్వాత స్పెయిన్ రిటైల్ వ్యాపారి అమన్సియో ఒర్టెగా (రూ.14,280 కోట్ల లాభం), చైనాకు చెందిన జోంగ్ షాన్షాన్ (రూ.12,600 కోట్ల లాభం) తదుపరి స్థానాల్లో నిలిచారు.
Mukesh Ambani Wealth | ఆరేళ్ల గరిష్టానికి చేరిన షేర్లు..
సోమవారం నాటి ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఏకంగా 11.6 శాతం మేర ఎగబాకాయి. గత ఆరేళ్ల కాలంలో రిలయన్స్ షేరుకి ఇదే అత్యంత పెద్ద రోజువారీ పెరుగుదల కావడం విశేషం. నిఫ్టీ-50 ఇండెక్స్‌లో అత్యధిక లాభాలు ఆర్జించిన స్టాక్‌గా ఇది నిలిచింది. ఇటీవల వెలువడిన సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో రిలయన్స్ రూ.25,548 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించి విశ్లేషకుల అంచనాలను మించిపోవడమే ఈ దూకుడుకు కారణమైంది. గతేడాదితో పోలిస్తే లాభాల్లో 40.6 శాతం వృద్ధి నమోదైంది. రిఫైనింగ్, పెట్రోకెమికల్ వ్యాపారాల్లో 68 శాతం, జియో ప్లాట్‌ఫామ్స్‌లో 16.6 శాతం వృద్ధి నమోదవ్వడం మదుపరులలో అపారమైన నమ్మకాన్ని పెంచింది.
Mukesh Ambani Wealth | పెట్టుబడుల విస్తరణ..
పెట్రోకెమికల్స్, ఆయిల్ & గ్యాస్, టెలికాం, రిటైల్, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి పలు ప్రధాన రంగాల్లో అంబానీకి భాగస్వామ్యం ఉంది. 1966లో చిన్న జౌళి తయారీ సంస్థగా ప్రస్థానం ప్రారంభించిన రిలయన్స్, నేడు రూ.10,50,000 కోట్ల ఆదాయం కలిగిన మహావృక్షంగా మారింది. ఇందులో జియో ప్లాట్‌ఫామ్స్ ఏకంగా రూ.13 లక్షల కోట్ల మార్కెట్ విలువతో దేశంలోనే రెండో అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, రాబోయే 7 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.9,24,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Jawahar Navodaya Campus | జవహర్ నవోదయ క్యాంపస్ పనులను వేగంగా పూర్తిచేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి