అక్షరటుడే వెబ్‌డెస్క్: Netanyahu Hamas Warning | ఇజ్రాయెల్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుగా నిలిచిన 2023 అక్టోబర్ 7 నాటి హమాస్ దాడికి సంబంధించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడికి ముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హెచ్చరించినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ పత్రిక ‘హారెట్జ్’ పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. గాజాలో హమాస్ కీలక నేత యాహ్యా సిన్వార్ ఒక భారీ ‘భూకంపం’ లాంటి భయానక దాడికి సిద్ధమవుతున్నాడని యూఏఈ అధ్యక్షుడు ముందే సమాచారం అందించినట్లు ఆ కథనం పేర్కొంది.
Netanyahu Hamas Warning | 45 నిమిషాల ఫోన్ కాల్..
అక్టోబర్ 7 మారణకాండకు సుమారు వారం, పది రోజుల ముందు బిన్ జాయెద్.. నెతన్యాహుతో ఫోన్లో దాదాపు 45 నిమిషాలపాటు మాట్లాడారు. ఈ సందర్భంగా గాజాలో ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని, ఇది మధ్యప్రాచ్యంలో భారీ రక్తపాతానికి, అస్థిరతకు దారితీస్తుందని, అంతేకాకుండా ఇజ్రాయెల్-అరబ్ దేశాల మధ్య కుదిరిన ‘అబ్రహం ఒప్పందాలు’ కూడా దెబ్బతింటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ హెచ్చరికపై నెతన్యాహు చాలా ప్రశాంతంగా స్పందించారని, హమాస్ ప్రధానంగా వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోనే అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బదులిచ్చినట్లు కథనంలో తెలిపారు. ఆ తర్వాత బిన్ జాయెద్ ఈ సంభాషణ గురించి అప్పటి సీఐఏ డైరెక్టర్ విలియం జె. బర్న్స్‌కు కూడా తెలిపారు.
Netanyahu Hamas Warning | రహస్య చర్చలు..
యూఏఈ అధ్యక్షుడితో పాటు ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్బాస్ కామెల్ కూడా హమాస్ భారీ చర్యకు సిద్ధమవుతోందని నెతన్యాహును హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఈ అత్యున్నత స్థాయి హెచ్చరికల గురించి షిన్ బెట్, మొసాద్, ఐడీఎఫ్ (IDF) చీఫ్ వంటి కీలక భద్రతా వ్యవస్థల అధిపతులకు నెతన్యాహు సమాచారం అందించలేదని ‘హారెట్జ్’ ఆరోపించింది. 2023 ప్రారంభంలో షిన్ బెట్, హమాస్ మధ్య రహస్య చర్చలు జరిగినప్పటికీ, మంత్రివర్గ కమిటీ ఆమోదం ఆలస్యం కావడం, రాజకీయ భయాల కారణంగా ఆ చర్చలు నిలిచిపోయాయి. ఆ తర్వాత సెప్టెంబర్ మధ్యలో సిన్వార్ ‘భయానక ఆపరేషన్’కు సిద్ధమవుతున్నట్లు అందిన సమాచారాన్ని షిన్ బెట్ చీఫ్ రోనెన్ బార్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ముందే స్పందించి ఉంటే ఇంతటి పెనుప్రమాదం తప్పి ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Netanyahu Hamas Warning | రాజకీయ దుమారం..
‘హారెట్జ్’ ప్రచురించిన ఈ కథనంపై ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఈ కథనం పూర్తిగా అబద్ధమని, ఆ సమయంలో యూఏఈ అధ్యక్షుడి నుంచి తనకు ఎలాంటి హెచ్చరికలు అందలేదని, ఆయనతో తాను మాట్లాడలేదని స్పష్టం చేసింది. అయితే ఈ కథనం ఇజ్రాయెల్‌లో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ స్పందిస్తూ.. విదేశీ నేతల నుంచి స్పష్టమైన హెచ్చరికలు వచ్చినా నెతన్యాహు వాటిని పెడచెవి పెట్టారని, హమాస్‌ను ఒక ‘ఆస్తి’గా భావించే తన విధానంలో ఆయన బలంగా చిక్కుకుపోయి అక్టోబర్ 7 విపత్తుకు కారణమయ్యారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: Glass Wall Systems IPO | మార్కెట్లోకి మరో చిన్న ఐపీవో.. జీఎంపీ ఎంతంటే?