Radhika Apte Balakrishna | బాలయ్య ‘లెజెండ్’ సినిమాపై రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్..

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Radhika Apte Balakrishna | టాలీవుడ్‌లో ( Tollywood )  ఒకప్పుడు కథానాయికగా అలరించి, ఆ తర్వాత బాలీవుడ్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తెలుగులో తాను నటించిన ఓ సినిమా అనుభవాన్ని ప్రస్తావిస్తూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Radhika Apte Balakrishna | అసలేం జరిగిందంటే?

కీర్తి సురేష్‌తో కలిసి రాధికా ఆప్టే నటించిన ‘అక్క’ వెబ్‌సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో అత్యంత కష్టమైన, అసౌకర్యంగా అనిపించిన పాత్ర గురించి ఆమె మాట్లాడారు. “ఒక తెలుగు సినిమాలో నాకంటే చాలా ఎక్కువ వయసున్న నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చింది. ఆ కథలో మేనరికపు వివాహ నేపథ్యం ఉంటుంది. అంతేకాకుండా, సినిమా సగంలోనే నా పాత్ర చనిపోతుంది. ఆ తర్వాత హీరో నా మృతదేహాన్ని భుజాన వేసుకుని యాక్షన్ సీక్వెన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ అనుభవం నాకు ఏమాత్రం నచ్చలేదు” అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

Radhika Apte Balakrishna | ‘లెజెండ్’ సినిమానే టార్గెట్?

రాధికా ఆప్టే చెప్పిన కథాంశం, పాత్ర వివరాలన్నీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘లెజెండ్’ (2014) సినిమాకే సరిపోతుండటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ సినిమా విడుదలైన సమయంలో బాలకృష్ణ వయసు 54 ఏళ్లు కాగా, రాధికా ఆప్టే వయసు 29 ఏళ్లు.

Radhika Apte Balakrishna | బాలయ్య అభిమానుల ఆగ్రహం..

రాధిక వ్యాఖ్యలపై బాలకృష్ణ అభిమానులు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “కథ, పాత్ర నచ్చనప్పుడు అప్పుడే ఆ సినిమాను ఎందుకు అంగీకరించారు?” అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ‘లెజెండ్’ నచ్చకపోతే మళ్లీ 2015లో బాలయ్య సరసన ‘లయన్’ సినిమాలో ఎందుకు నటించారంటూ మరికొందరు నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. అయితే, నటీనటులకు తమ గత అనుభవాలను పంచుకునే స్వేచ్ఛ ఉందంటూ కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

Radhika Apte Balakrishna | భిన్నాభిప్రాయాలు..

ఈ వివాదం కేవలం ఒక నటి వ్యాఖ్యలకే పరిమితం కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో కథానాయకుడు-కథానాయికల మధ్య ఉండే వయసు అంతరాలు, మహిళా పాత్రల ప్రాధాన్యతపై కొత్త చర్చకు తెరలేపింది. ‘అక్క’ సిరీస్ ప్రమోషన్ల సమయంలో రాధికా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఇతి కూడా చదవండి: Madhavnagar ROB Approvals | కాంగ్రెస్​ కృషితోనే మాధవ్​నగర్​ ఆర్వోబీకి పరిపాలన అనుమతులు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *