Rahul Gandhi Assets Case | రాహుల్ గాంధీ ఆస్తుల కేసు : సీబీఐకి అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rahul Gandhi Assets Case | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆదాయ వనరులకు మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలకు సంబంధించిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ వ్యవహారంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన అఫిడవిట్‌లో దర్యాప్తు పురోగతిపై స్పష్టత లేదని పేర్కొంటూ, పూర్తి వివరాలతో కొత్త అఫిడవిట్‌ను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

Rahul Gandhi Assets Case | దర్యాప్తు అంశం స్పష్టంగా లేదంటూ..

జస్టిస్ బ్రిజ్ రాజ్ సింగ్, జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సీబీఐ సమర్పించిన నివేదికలో దర్యాప్తు ఎంతవరకు జరిగిందనే అంశం స్పష్టంగా లేదని కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ నాటికి సీనియర్ అధికారి ద్వారా తాజా అఫిడవిట్ దాఖలు చేసి, దర్యాప్తు పురోగతిని వివరించాలని సూచించింది.

ఈ కేసులో అమలు సంచాలక సంస్థ (ఈడీ) ఇప్పటికే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకున్నట్లు ధర్మాసనం పేర్కొంది. దర్యాప్తులో చట్టపరమైన చర్యలకు ఆధారమైన సమాచారం, పత్రాలు లభిస్తే, చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపట్టేందుకు ఈడీకి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది.

Pavan Chandana Vikram 1 | నవతరం స్ఫూర్తి ప్రదాత పవన్ చందన: మ్యాథ్స్​లో 50 మార్కుల నుంచి అంతరిక్ష చరిత్ర వరకు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సంకల్పం

Rahul Gandhi Assets Case | కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని..

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం, సిబ్బంది వ్యవహారాల శాఖ, రెవెన్యూ శాఖ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ), కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు ఇతర ప్రతివాదులకు నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోంది. రాహుల్ గాంధీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తెలిసిన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.

Rahul Gandhi Assets Case | ప్రతి వారం కోర్టుకు నివేదిక సమర్పించాలని..

గతంలో ఈ ఫిర్యాదును సీబీఐ, ఈడీ స్వీకరించినట్లు కోర్టు నమోదు చేసింది. ఆరోపణలపై చట్ట ప్రకారం పరిశీలన జరపవచ్చని పేర్కొంటూనే, ఆరోపణల నిజానిజాలపై తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని స్పష్టం చేసింది.

తాజా విచారణ సందర్భంగా పిటిషనర్ మరో రెండు మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేశారు. రాహుల్ గాంధీ పాస్‌పోర్టును బ్లాక్ చేయాలని, దర్యాప్తు పురోగతిపై ప్రతి వారం కోర్టుకు నివేదిక సమర్పించాలని అందులో కోరారు. ఈ అంశాలపై సంబంధిత అధికారుల నుంచి సూచనలు తీసుకుని సమాధానం దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదికి కోర్టు ఆదేశించింది.

ఈ కేసును పాక్షికంగా విచారణ పూర్తయిన అంశంగా అదే ధర్మాసనం ముందు కొనసాగించాలని, తదుపరి విచారణను ఆగస్టు 20కు వాయిదా వేసింది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *