Silk Smitha Suicide Letter | వెండితెర ‘గ్లామర్ క్వీన్’ కన్నీటి కథనం.. సిల్క్ స్మిత జీవితంలోని విషాద అధ్యాయం.. నెట్టింట వైరల్​ అవుతున్న సూసైడ్​ నోట్​!

గ్లామర్‌ ప్రపంచంలో ఎంత సాధించినా, కోట్లాది మంది అభిమానాన్ని పొందినా, తనకు కావలసిన కనీస ‘మనశ్శాంతి’ దక్కలేదని ఆమె వాపోయింది. దేవుడు తనను కేవలం వేషం కోసమే పుట్టించాడని భావిస్తూ, తీవ్ర మానసిక ఒత్తిడికి గురై జీవితాన్ని ముగించింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Silk Smitha Suicide Letter | తెలుగు Telugu, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమలను ఒక ఊపు ఊపిన నటి సిల్క్ స్మిత (విజయలక్ష్మి). వెండితెరపై వేలాది మంది అభిమానులను అలరించి, తన చూపులతో, నటనతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన ఆ తార వెనుక ఇంతటి కన్నీటి వ్యథ దాగుందని ఊహించడం ఎవరికైనా కష్టమే.

1996 సెప్టెంబర్ 23న ఆమె దివికేగే వరకు ప్రపంచానికి తెలిసింది కేవలం ఆమె గ్లామర్ మాత్రమే. కానీ ఆమె రాసిన ఆఖరి ఉత్తరం చదివితే ఎంతటి రాయి లాంటి గుండెయినా కరగక తప్పదు.

సుమారు 30 ఏళ్ల తర్వాత నెట్టింట వైరల్​ అవుతున్న ఆమె రాసిన చివరి లేఖ, గ్లామర్ ప్రపంచం వెనుక ఉన్న భయానకమైన ఏకాంతాన్ని, నమ్మకద్రోహాన్ని సజీవంగా ఆవిష్కరిస్తోంది.

Pavan Chandana Vikram 1 | నవతరం స్ఫూర్తి ప్రదాత పవన్ చందన: మ్యాథ్స్​లో 50 మార్కుల నుంచి అంతరిక్ష చరిత్ర వరకు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సంకల్పం

Silk Smitha Suicide Letter | 7 ఏళ్ల వయసు నుంచే కష్టాలు…

“దేవుడా, నా 7వ సంవత్సరం నుంచి నా పొట్టకి కష్టపడ్డాను. నాకు నావారు అంటూ ఎవరూ లేరు. నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారు… అందరూ నా కష్టం తిన్నవారే.”

ఆమె రాసిన ప్రతి అక్షరం ఒక కన్నీటి బొట్టు. చిన్నతనంలోనే బతుకు పోరాటం మొదలుపెట్టిన సిల్క్ స్మిత, స్వయంకృషితో సినీ రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగింది.

కానీ ఆమె చుట్టూ ఉన్నవారు ఆమె సంపాదనను, కష్టాన్ని అనుభవించారే తప్ప, ఆమెకు దక్కాల్సిన అసలైన ప్రేమాభిమానాలను ఎవ్వరూ ఇవ్వలేదు. అందరూ ఆమెను ఒక ఆర్థిక వనరుగానే చూశారే తప్ప మనిషిగా గుర్తించలేకపోయారనే చేదు నిజాన్ని ఆమె తన లేఖలో ఆవేదనగా పేర్కొంది.

Silk Smitha Suicide Letter | ప్రేమ పేరిట వంచన…

సూసైడ్ లెటర్‌లో అత్యంత హృదయ విదారకమైన అంశం — ఆమెను ప్రేమ పేరుతో మోసం చేసిన తీరు. ఐదేళ్ల క్రితం ఒక వ్యక్తి తనకు జీవితాన్ని ఇస్తానని నమ్మించి, ఆ తర్వాత వదిలేశాడని ఆమె పేర్కొంది.

నచ్చిన నగలు కొనుక్కున్నా, వాటిని వేసుకునే స్వేచ్ఛ కూడా తనకు లేకుండా చేశారని, రోజూ నరకం చూపించారని రాసుకొచ్చింది. తన ఆస్తులలో కొద్దిపాటిని మాత్రమే మిగిల్చి, దానిని ‘బాబు’ కుటుంబానికి, తన కుటుంబానికి పంచాలని సూచిస్తూ, చివరి నిమిషంలోనూ ఇతరుల బాధ్యతను మోసింది.

ఆమె రాసిన మాటల్లో “ఇది రాయడానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలుసు” అనే వాక్యం ఆమె చివరి ఘడియల్లో అనుభవించిన మానసిక వేదనకు అద్దం పడుతుంది.

Silk Smitha Suicide Letter | మాయని మచ్చగా మిగిలిన తీరని లోటు

గ్లామర్‌ ప్రపంచంలో ఎంత సాధించినా, కోట్లాది మంది అభిమానాన్ని పొందినా, తనకు కావలసిన కనీస ‘మనశ్శాంతి’ దక్కలేదని ఆమె వాపోయింది. దేవుడు తనను కేవలం వేషం కోసమే పుట్టించాడని భావిస్తూ, తీవ్ర మానసిక ఒత్తిడికి గురై జీవితాన్ని ముగించింది.

అందరికీ మంచి చేసినా చివరికి వంచన మాత్రమే మిగిలిందన్న సిల్క్ స్మిత కన్నీటి కథనం, సినీ రంగుల ప్రపంచంలో వెలుగుల వెనుక ఉండే చీకటి కోణాన్ని మనకు ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటుంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *