అక్షరటుడే, వెబ్డెస్క్: Rajarajeshwari Devi Alankaram | శరన్నవరాత్రుల వేడుకలు ముగింపు దశకు చేరుకోనున్నాయి. చివరి రోజైన ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) రోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ భక్తులకు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తోంది. ఎడమ చేతిలో చెరుకుగడ, కుడి చేతితో అభయాన్ని ప్రసాదిస్తూ.. శ్రీచక్రరాజ అధిష్ఠానదేవతగా అమ్మవారు భక్తులను కటాక్షిస్తున్నారు. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందించే ఈ తల్లిని త్రికరణశుద్ధిగా పూజిస్తే సకల కార్యాల్లో విజయం సిద్ధిస్తుందని నమ్మకం.
Rajarajeshwari Devi Alankaram | అలంకార విశిష్టత..
ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల వృత్తి, వ్యాపారాలు , ఉద్యోగాల్లో విశేషమైన అభివృద్ధి లభిస్తుంది. జీవితంలోని కష్టాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని దేవీ పురాణం చెబుతోంది. ఈ రోజున అమ్మవారిని ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా చక్రపొంగలి, పులిహోర, గారెలు, బూరెలు, లడ్డూ , రవ్వ కేసరిని సమర్పిస్తారు.
Rajarajeshwari Devi Alankaram | శమీ పూజ విశిష్టత..
విజయదశమి (Vijayadashami) రోజున జమ్మి చెట్టుకు (శమీ పూజ) పూజ చేయడం హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యం. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుడిని వధించిన రోజు ఇదే కాగా, ద్వాపరయుగంలో పాండవులు తమ అజ్ఞాతవాసం ముగిశాక శమీ వృక్షాన్ని పూజించి, దానిపై దాచిన తమ ఆయుధాలను తిరిగి పొంది కౌరవులపై విజయం సాధించారు. జమ్మి చెట్టును పూజిస్తే శత్రువులపై విజయం లభిస్తుందని భక్తుల విశ్వాసం. పూజ సమయంలో ఈ క్రింది శ్లోకం చదువుతారు.
“శమీ శమయతే పాపం, శమీ శత్రువినాసినీ!
అర్జునస్య ధనుర్దారీ, రామస్య ప్రియదర్శినీ!”
Rajarajeshwari Devi Alankaram | ఆయుధ పూజ ..
పూర్వకాలంలో రాజులు, క్షత్రియులు యుద్ధాలకు వెళ్లే ముందు ఆయుధ పూజ చేసేవారు. కాలక్రమేణా అది మారిపోయి.. ఇప్పుడు వివిధ వృత్తుల వారు తమ పనిముట్లు, వాహనాలు , ఆయుధాలను పూజించే ఆచారంగా మారింది. విజయదశమి రోజున మండపాల్లో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాల నిమజ్జనం పూర్తి చేసి, సామూహిక పూజలు నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి..: Oct 19 Horoscope | నేటి రాశి ఫలాలు: ప్రేమ, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో 12 రాశుల వారికి ఎలా ఉంది?