Varalakshmi Vratam 2026 | రేపే వరలక్ష్మీ వ్రతం.. పూజ విధానం , విశిష్టత ఇదే!

హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో పండుగల సందడి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Varalakshmi Vratam 2026 | హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో  ( Shravana masam )  పండుగల సందడి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం, సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. ఇప్పటికే నాగపంచమి, మంగళగౌరీ వ్రతాలు ఘనంగా ముగియగా, ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన వరలక్ష్మీ వ్రతం పర్వదినం వచ్చింది. ఈ పవిత్రమైన రోజున భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు, అష్టలక్ష్మీ కటాక్షం వెల్లివిరుస్తాయని నమ్ముతారు. ఈసారి ఐదు శ్రావణ శుక్రవారాలు రావడం మరింత విశేషం.

Varalakshmi Vratam 2026 | వ్రత విశిష్టత ..

పురాణాల ప్రకారం, వరలక్ష్మీ వ్రతానికి ఆది దేవతగా పరిగణించే లక్ష్మీదేవి ఒకరోజు రాత్రి వేళ చారుమతికి కలలో కనిపించి ఈ వ్రత మహత్యాన్ని తెలపినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. ముత్తైదువులు భక్తితో ఆచరించే ఈ వ్రతంతో సంపద, ఐశ్వర్యంతో పాటు సకల శ్రేయస్సు కలుగుతాయి. దీపావళి పూజతో సమానమైన ఫలితాలను ఇచ్చే ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం అనునిత్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంకా ఈ రోజు చారుమతి కథను చదవడం, కనకధారా స్తోత్రాన్ని పఠించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

Varalakshmi Vratam 2026 | పూజా సామాగ్రి..

వరలక్ష్మీ వ్రతానికి పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు , పూలమాలలు వంటివి ప్రధానంగా అవసరమవుతాయి. వీటితో పాటు తమలపాకులు, 30 వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర పైసలు సిద్ధం చేసుకోవాలి. అమ్మవారి అలంకరణ కోసం తెల్లని వస్త్రం, రవికల గుడ్డ, మామిడి ఆకులు, ఐదు రకాల పండ్లు, అమ్మవారి ఫోటో లేదా ప్రతిమ, కలశం, కొబ్బరికాయలు సమకూర్చుకోవాలి. తోరాల తయారీకి తెల్ల దారం లేదా నోము దారం (పసుపు రాసిన కంకణం) తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఇంట్లో తయారుచేసిన నైవేద్య ప్రసాదాలు, అక్షింతలు, పంచామృతాలు, దీపారాధన కొరకు నెయ్యి , వత్తులను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి.

Varalakshmi Vratam 2026 గణేశుని ఆరాధనతో పూజా ప్రారంభం..

హిందూ సంప్రదాయం ప్రకారం ఏ పూజనైనా విఘ్నాలు తొలగించే వినాయకుడి పూజతోనే ప్రారంభించాలి. పసుపుతో చిన్న గణపతిని చేసి.. “శుక్లాంబరధరం విష్ణుం…” , వక్రతుండ మహాకాయ మంత్రాలతో వినాయకుడిని స్మరించాలి. ఆ తర్వాత అక్షింతలు చల్లి, యథాశక్తిగా పూజ నిర్వహించిన తర్వాతే ప్రధానంగా వరలక్ష్మీ వ్రత పూజను మొదలుపెట్టాలి.

Varalakshmi Vratam 2026 | పూజా విధానం..

తెల్లని దారానికి ఐదు లేదా తొమ్మిది పోగులు వేసి, పూర్తిగా పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది బంతిపూలు లేదా పసుపు రంగు పువ్వులను కట్టి, నిష్టగా ముడులు వేసి తోరాలను సిద్ధం చేసుకోవాలి. అమ్మవారి పీఠం వద్ద ఉంచిన తోరాలపై పూలు, పసుపు, కుంకుమ, అక్షింతలు ఉంచి కమలాయైన నమః, రమాయైన నమః వంటి నామాలను పఠిస్తూ పూజించాలి.

“బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం…” అనే మంత్రాన్ని పఠిస్తూ ఆ దారాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. పూజ ముగిసిన తర్వాత వ్రత కథను చదువుకుని, తలపై అక్షింతలు చల్లుకోవాలి. చివరగా ముత్తైదువులకు తాంబూలాలు అందించి, అమ్మవారికి నివేదించిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులంతా స్వీకరించాలి. ఉపవాసం లేదా నిష్టతో ఉండి పూజిస్తే అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *