అక్షరటుడే వెబ్‌డెస్క్: Sridhar Babu Comments | గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రణాళిక లేకుండా ఐటీ హబ్స్‌ను నిర్మించడంతో అవి మూతపడే పరిస్థితి వచ్చిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. అసెంబ్లీలో నిజామాబాద్ ఐటీ టవర్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. యాంకర్ లేదా ఇండస్ట్రీ పార్టనర్స్ భాగస్వామ్యం లేకుండానే వీటిని కట్టడం వల్లే చాలా చోట్ల నిరుపయోగంగా మారాయని స్పష్టం చేశారు. మూతపడిన ఆ ఐటీ హబ్‌లను తిరిగి గాడిన పెట్టేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.
Sridhar Babu Comments | టైర్-2 నగరాలకు ఐటీ విస్తరణ..
హైదరాబాద్‌పై ( Hyderabad ) భారాన్ని తగ్గించే లక్ష్యంతో నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ వంటి టైర్-2 నగరాలకూ ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామని శ్రీధర్ బాబు వెల్లడించారు. త్వరలోనే ఆదిలాబాద్‌లో ఐటీ టవర్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పరిశ్రమల భాగస్వామ్యం ముందుకొస్తే రాష్ట్రంలో మరిన్ని కొత్త ఐటీ హబ్స్‌ను అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని, ఈ విషయంలో బీజేపీ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
Sridhar Babu Comments | లక్ష మందికి ఉద్యోగాలు..
రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి తెలిపారు. గత రెండేళ్ల కాలంలోనే ఏకంగా 75కి పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయని, ఇది దేశంలోనే ఒక రికార్డు అని పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో లక్ష మంది యువతకు కొత్తగా కొలువులు దక్కాయని వివరించారు. త్వరలోనే సరికొత్త జీసీసీ పాలసీని కూడా తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఐటీ రంగానికి వెన్నెముకగా నిలిచే కాంప్రహెన్సివ్ ఎకో సిస్టమ్‌లో డేటా సెంటర్లు కీలకమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో డేటా సెంటర్ల వల్ల తలెండే సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. స్థానికులకు ఎలాంటి విద్యుత్ ఇబ్బందులు కలగకుండా డేటా సెంటర్లకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పవర్ సప్లై అందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా టైర్-2, టైర్-3 పట్టణాల్లోనూ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: EHS Health Card | అత్యవసర చికిత్సకు అక్కరకు రాని హెల్త్‌కార్డు.. పాప చికిత్స కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు