Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. ఎలా అప్లై చేయాలంటే?

క్యూర్​ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం అయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indiramma Housing Scheme | హైదరాబాద్​ (Hyderabad) నగరం (క్యూర్​) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇళ్ల కోసం దరఖాస్తు ప్రక్రియ మంగళవారం (జులై 21) నుంచి ప్రారంభం అయింది.

నగరంలో నివసిస్తున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం అందించనుంది. దీని కోసం అర్హులు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మీసేవ కేంద్రంతో పాటు వాట్సాప్ (WhatsApp) ఆధారిత దరఖాస్తు సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించే ముందు, అవసరమైన అన్ని పత్రాల స్కాన్ చేసిన కాపీలను లేదా స్పష్టమైన ఫోటోలను సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసేటప్పుడు ఇది చాలా అవసరం, ఎందుకంటే చాట్ సమయంలో మీరు పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అనంతరం మీసేవ పోర్టల్: http://meeseva.telangana.gov.in లో స్టేటస్​ చెక్​ చేసుకోవచ్చు. మీసేవ వాట్సాప్: 8096958096 నంబర్​లో సైతం తనిఖీ చేయొచ్చు.

Indiramma Housing Scheme | రూ.100 ఫీజు

హైదరాబాద్ నగరంలోని 26 నియోజకవర్గాల్లోని పేదలకు ఇళ్లు ఇవ్వనున్నారు. తొలి విడుతలో నియోజకవర్గానికి 500 ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైనవారు ఆగస్ట్ 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు సమయంలో రూ.100 ఫీజు చెల్లించాలి. దీనిని వెనక్కి ఇవ్వరు. టోకెన్ అడ్వాన్స్ కింద రూ.10 వేలు చెల్లించాలి. దరఖాస్తుదారులకు ఇళ్లు మంజూరు కాకపోతే ఈ డబ్బులను ప్రభుత్వం వెనక్కి ఇస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్​ కార్డు అవసరం.

Indiramma Housing Scheme | రూ.6 లక్షలు కట్టాలి

నగరంలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకునే వారు పదేళ్లు క్యూర్​ పరిధిలో నివాసం ఉండాలి. సొంత ఇల్లు, స్థలం ఉండకూడదు. గతంలో హౌసింగ్ స్కీమ్​ ద్వారా ప్రయోజనం పొందిన వారు అనర్హులు. ఇప్పుడు నివసిస్తున్న నియోజకవర్గం పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బహుళ అంతస్తులలో ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించనుంది. ఒక్క ఇంటికి రూ.11 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వం రూ.5 లక్షలు రాయితీ ఇస్తుంది. మిగతా రూ.6 లక్షలను లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఇల్లు కేటాయించే సమయంలో రూ.లక్ష, ఆర్‌సీసీ నిర్మాణ సమయంలో రూ.2 లక్షలు, పనులు చివరి దశకు చేరుకున్న తర్వాత రూ.2 లక్షలు, ఇల్లు అప్పగించే సమయంలో మిగతా రూ.లక్షను లబ్ధిదారులు చెల్లించాలి. ఇందిరమ్మ పథకం కింద కేటాయించిన ఇల్లును లబ్ధిదారులు అమ్మడానికి వీలులేదని ప్రభుత్వం తెలిపింది.

ఇది కూడా చదవండి..: GHMC Elections Petition | డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ నిలిపివేయాలి..జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *