అక్షరటుడే, బాన్సువాడ: EHS Health Card | జన్యుపర చర్మ సమస్యతో పుట్టిన పసికందుకు అత్యవసర వైద్యం అందించాల్సిన పరిస్థితిలో వారి దగ్గర ఉన్న హెల్త్‌కార్డు అక్కరకు రాకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగికి అందుబాటులో ఉన్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కార్డు పనికి రాకపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
EHS Health Card | కామారెడ్డి జిల్లాలో..
ప్రైవేటు ఆస్పత్రిలో ఈహెచ్ఎస్ కార్డు ద్వారా నగదు రహిత వైద్యం అందించేందుకు నిరాకరించడంతో రోజూ రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కామారెడ్డి జిల్లా (Kamareddy District) మహమ్మద్‌నగర్ మండలం మక్దూంపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహమ్మద్ షఫీక్‌కు ఆగస్టు 21న కూతురు జన్మించింది. పుట్టినప్పటి నుంచే చిన్నారి చర్మంపై పెద్దపెద్ద పొక్కులు ఏర్పడి, చర్మం ఊడిపోతూ తీవ్ర గాయాలు అవుతున్నాయని తల్లిదండ్రులు తెలిపారు. శరీరమంతా గాయాలు విస్తరించడంతో మెరుగైన వైద్యం కోసం ఆగస్టు 27న సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చిన్నారిని తీసుకెళ్లారు.
EHS Health Card | అత్యవసర పరిస్థితుల్లో..
అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడ ఈహెచ్ఎస్ కార్డు ద్వారా నగదు రహిత వైద్యం అందదని ఆస్పత్రి వర్గాలు చెప్పినట్లు షఫీక్ తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించి చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు. ప్రస్తుతం 15 రోజులుగా చికిత్స కొనసాగుతోంది.
EHS Health Card | రోజూ వేలల్లో ఖర్చు..
చిన్నారికి చికిత్సతో పాటు తల్లిదండ్రులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుండటంతో మందులు, వైద్యఖర్చులతో పాటు భోజనం, వసతి తదితర ఖర్చులు కూడా అదనంగా అవుతున్నాయని షఫీక్ వాపోయారు. రోజుకు వేలాది రూపాయలు ఖర్చవుతున్నాయని, చికిత్స ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో తెలియని పరిస్థితిలో మొత్తం బిల్లు ఎంత అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. తమ పాపను ఈహెచ్ఎస్ కార్డులో చేర్చుకున్నామని, గత నాలుగు నెలలుగా ఆరోగ్య పథకం కోసం తన వేతనం నుంచి ప్రతినెలా డబ్బులు మినహాయిస్తున్నారని షఫీక్ తెలిపారు. అవసరమైన సమయంలో అదే ఆరోగ్య పథకం ద్వారా నగదు రహిత వైద్యం అందకపోవడం బాధాకరంగా ఉందన్నారు.
EHS Health Card | ప్రభుత్వం స్పందించాలి..
చిన్నారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి ఈహెచ్ఎస్ పరిధిలో నగదు రహిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని షఫీక్ కుటుంబం కోరుతోంది. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య కార్డులు నిజంగా ఉపయోగపడేలా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Nizamabad DMHO Harassment | అధికారం పేరిట ఆధిపత్యం.. బూతుల ‘సమీక్షలు’! నిజామాబాద్ జిల్లా వైద్య శాఖలో నియంత పాలన!