అక్షర టుడే, నందిపేట్: PDS Rice Seized | అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రేషన్ బియ్యాన్ని నందిపేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసి, రేషన్ బియ్యంతో పాటు తరలింపునకు ఉపయోగించిన మహేంద్ర బొలెరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
PDS Rice Seized | 48 ప్లాస్టిక్ సంచుల్లో రేషన్ బియ్యం
నందిపేట్ ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు రైతు ఫారం గ్రామ శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో AP 25 X 9971 నంబర్ గల మహేంద్ర బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో వేర్వేరు పరిమాణాల్లో ఉన్న 48 ప్లాస్టిక్ సంచుల్లో రేషన్ బియ్యం గుర్తించారు. వాహనం డ్రైవర్ సయ్యద్ ఆన్సర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
PDS Rice Seized | 310 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత.. రూ.9 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం
విచారణలో మాక్లూర్ గ్రామానికి చెందిన ‘చోటు’ అనే వ్యక్తి చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుంచి పీడీఎస్ బియ్యాన్ని కిలో రూ.18 చొప్పున సేకరిస్తున్నట్లు, అనంతరం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ ఆన్సర్, ఎండి మోసిన్ కలిసి కిలో రూ.20 చొప్పున కొనుగోలు చేసి, బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.25 చొప్పున విక్రయించేందుకు తరలిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
PDS Rice Seized | తహసీల్దార్ పంచనామా..
సమాచారం అందుకున్న నందిపేట్ ఇన్‌ఛార్జి డిప్యూటీ తహసీల్దార్ సి.ఎస్. గింగూరి వినోద్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా 48 సంచుల్లో మొత్తం 22 క్వింటాళ్ల 60 కిలోల పీడీఎస్ బియ్యం, అంచనా విలువ రూ.1,12,548గా అధికారులు గుర్తించారు. బియ్యంతో పాటు మహేంద్ర బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యల నిమిత్తం భద్రత కోసం శివశక్తి రైస్ మిల్‌కు అప్పగించి, రసీదు పొందినట్లు అధికారులు తెలిపారు. బొలెరో వాహనాన్ని నందిపేట్ పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచారు.
ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని అధికారులు పేర్కొన్నారు. ఈ అక్రమ రవాణాలో భాగస్వాములైన డ్రైవర్ సయ్యద్ ఆన్సర్, ఎండి మోసిన్, చోటు, బొలెరో వాహన యజమాని మహమ్మద్ ఖురేషీపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.