అక్షరటుడే, కామారెడ్డి: Transformer Copper Theft | జల్సాలకు, ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో అన్నదమ్ములు నలుగురు ముఠాగా ఏర్పడి పాల్పడుతున్న చోరీలకు కామారెడ్డి పోలీసులు చెక్ పెట్టారు. జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ చోరీ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Transformer Copper Theft | 29 ట్రాన్స్ఫార్మర్లు..
జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మీడియాకు వివరాలు వెల్లడించారు. గత ఐదు నెలలుగా భిక్కనూర్ మండల పరిధిలోని బస్వాపూర్, భిక్కనూర్, గుర్జకుంట, రమేశ్వరపల్లి, జంగంపల్లి, ర్యాగట్లపల్లి గ్రామాల శివారులతో పాటు రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల శివార్లలో 29 ట్రాన్స్ ఫార్మర్లలోని కాపర్ కాయిల్స్ చోరీకి గురైనట్లు అసిస్టెంట్ ఇంజినీర్ జాదవ్ బాలాజీ ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్ 9న రామేశ్వరపల్లి శివారులో చోరీ చేస్తుండగా అడ్డుకున్న లైన్‌మన్ ప్రభాకర్‌పై హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై కూడా కేసు నమోదైంది. దీంతో ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో భిక్కనూర్ సీఐ జగడం నరేష్, సీసీఎస్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు అనిల్, మహేష్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి భిక్కనూరు మండలంలోని పరివార్ హోటల్ వద్ద మరొక చోరీ చేస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నలుగురు నిందితులు సొంత అన్నదమ్ములని, మేడ్చల్-హైదరాబాద్‌కు చెందిన బల్జీర్ సింగ్ చతుర్ సింగ్ టాక్, రూప్ సింగ్ చతుర్ సింగ్ టాక్, లకన్ చతుర్ సింగ్ టాక్‌గా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.
Transformer Copper Theft | గతంలోనూ వీరిపై కేసులు..
వీరు గతంలోనూ దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ పద్ధతి మార్చుకోకుండా పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రివేళల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ ముఠా కామారెడ్డిలో 29, మెదక్ జిల్లాలో 23 చొప్పున మొత్తం 52 ట్రాన్స్ ఫార్మర్ దొంగతనాలు, ఒక హత్యాయత్నం, ఒక ఇంటి దొంగతనం చేసినట్లు తేలింది. దొంగిలించిన కాపర్‌ను హైదరాబాద్‌లో ఓ మధ్యవర్తి ద్వారా ముగ్గురు వ్యక్తులకు కిలో రూ. వెయ్యి చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మధ్యవర్తి, కొనుగోలుదారుల కోసం ప్రత్యేక బృందం గాలింపు చేపడుతోంది. నిందితుల నుండి 30 కిలోల కాపర్ వైర్, బైక్, మొబైల్ ఫోన్‌తో పాటు చోరీకి ఉపయోగించిన కట్టర్లు, పానాలు, రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ మధుసూదన్, భిక్కనూర్ సీఐ జగడం నరేష్, ఎస్సై అనిల్, సీసీఎస్ సీఐ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: EHS Health Card | అత్యవసర చికిత్సకు అక్కరకు రాని హెల్త్‌కార్డు.. పాప చికిత్స కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు