Kamareddy General Hospital | జీజీహెచ్​లో రోగుల అవస్థలు.. మూడు రోజులుగా రిపోర్టులు బంద్

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy General Hospital | కామారెడ్డి జిల్లా (Kamareddy District) జనరల్ ఆస్పత్రిలో రోగులు అవస్థలు పడుతున్నారు. మూడు రోజులుగా రోగులకు పరీక్షలు చేసిన అనంతరం రిపోర్టులు ఇచ్చే ప్రింటర్ పాడైంది. దీంతో రిపోర్టులు అందక వారు అవస్థలు పడుతున్నారు.

Kamareddy General Hospital | ప్రతిరోజు వందల మంది రోగులు..

పట్టణంలోని జిల్లా జనరల్ ఆస్పత్రికి ప్రతి రోజు వందలాది మంది వివిధ వైద్య పరీక్షల నిమిత్తం వస్తుంటారు. వైద్య పరీక్షలు చేసుకున్న రోగులకు రెండు లేదా మూడు గంటల్లో అదేరోజు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వైద్య పరీక్షలు చేసుకున్న రోగులు, వారి బంధువులు మూడు రోజులుగా రిపోర్టుల కోసం ఆస్పత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆస్పత్రిలో రూమ్ నంబర్ 91లో సిబ్బంది రిపోర్ట్స్ అందజేస్తారు. గత మూడు రోజులుగా ప్రింటర్ చెడిపోవడంతో రిపోర్టులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దాంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కామారెడ్డి ఏరియా ఆస్పత్రి పేరుకు మాత్రమే జనరల్ ఆస్పత్రిగా మార్చారు తప్ప రోగులకు సరైన వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రింటర్ చెడిపోతే మూడు రోజులైనా పట్టించుకోకపోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రికి (Government Hospital) నిరుపేదలు మాత్రమే వస్తుంటారు. ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడే పేదలను చిన్నచిన్న కారణలతో ఇబ్బందులకు గురిచేయడం భావ్యం కాదని రోగులు పేర్కొంటున్నారు. ప్రింటర్ చెడిపోతే గంట, లేదా రెండు గంటల్లో బాగుచేసే టెక్నీషియన్లు కామారెడ్డిలో ఉన్నారు. రిపేర్ చేయించకుండా నిర్లక్ష్యం వహించడం రోగుల ప్రాణాలతో ఆటలాడుకోవడమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి తక్షణమే అదనపు ప్రింటర్ తెప్పించి రోగుల రిపోర్టులు ఇవ్వాలని కోరుతున్నారు.

Kamareddy General Hospital | ల్యాబ్ సిబ్బందిపై తిరగబడ్డ ప్రజలు

అయితే ఆస్పత్రిలోని రూమ్ నంబర్ 87లో వివిధ వైద్య పరీక్షలకు సంబంధించి పరీక్షించే ల్యాబ్ ఉంది. ఇక్కడ రోగుల నుంచి రక్త నమూనాలు తీసుకుని పరీక్ష చేసి మధ్యాహ్నం వరకు అక్కడే రిపోర్ట్స్ ఇస్తారు. అయితే బుధవారం రిపోర్ట్స్ రావడం లేదని చెప్పడంతో సుమారు 50 మంది రోగుల బంధువులు ల్యాబ్ సిబ్బందిపై తిరగబడినట్టు సమాచారం. ఇవాళ కూడా ల్యాబ్ లో అడిగితే రిపోర్ట్స్ రావడం లేదనే సమాధానం మాత్రమే రావడం పట్ల రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: kamareddy police | పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్..

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *