Indian Cricket Schedule | ఐపీఎల్ త‌ర్వాత టీమిండియా షెడ్యూల్ బిజీ బిజీ.. మహిళలు, అండర్-19 జట్లకు కూడా కీలక టోర్నీలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Cricket Schedule | ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ మొత్తం ఫ్రాంచైజీ లీగ్‌ల జోష్‌లో ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) ఉత్కంఠభరితంగా సాగుతుండగా, అభిమానులు క్రికెట్ మజాను ఆస్వాదిస్తున్నారు. అయితే ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్లు అంతర్జాతీయ వేదికలపై తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి.

ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) పురుషుల జట్టు, మహిళల జట్టు, ఇండియా-ఏ, అండర్-19 విభాగాలకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ను ప్రకటించింది. జూన్ నుంచి ఏడాది చివరి వరకు భారత జట్లకు వరుస సిరీస్‌లు ఉండటంతో క్రికెట్ అభిమానులకు ఎడతెరిపిలేని వినోదం అందనుంది. భారత ఇండియా-ఏ పురుషుల జట్టు ఆస్ట్రేలియా-ఏ జట్టుతో మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్‌లో పుదుచ్చేరి వేదికగా నిర్వహించనున్నారు.

Indian Cricket Schedule | అండర్-19 జట్లకు కీలక టోర్నీలు

సెప్టెంబర్ 22, 29 తేదీల్లో రెండు మల్టీ ఫార్మాట్ మ్యాచ్‌లు, అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో మూడు వన్డేలు ఉండ‌నుండ‌గా, ఈ సిరీస్ ద్వారా యువ ఆటగాళ్లు జాతీయ జట్టులో చోటు కోసం తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించనుంది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో భారత అండర్-19 జట్టు సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 18 నుంచి రాజ్‌కోట్‌లో వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో చివరి మల్టీ ఫార్మాట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇక మహిళల అండర్-19 విభాగంలో శ్రీలంక జట్టు భారత పర్యటనకు రానుంది. జూన్ 22 నుంచి చెన్నైలో టీ20 సిరీస్ ప్రారంభమవుతుండగా.. జూన్ 30 నుంచి పుదుచ్చేరిలో వన్డే సిరీస్ నిర్వహించనున్నారు.

Indian Cricket Schedule | భారత మహిళల జట్టుకు వరుస సిరీస్‌లు

భారత సీనియర్ మహిళల జట్టు అక్టోబర్‌లో జింబాబ్వే మహిళల జట్టుతో సిరీస్ ఆడనుంది.

టీ20 సిరీస్ – రాయ్‌పూర్
అక్టోబర్ 16
అక్టోబర్ 18
అక్టోబర్ 20

వన్డే సిరీస్ – బరోడా
అక్టోబర్ 23
అక్టోబర్ 25
అక్టోబర్ 28

అదేవిధంగా ఇంగ్లాండ్ మహిళల ఏ-జట్టు, ఆస్ట్రేలియా మహిళల ఏ-జట్లతో కూడా భారత్ వరుస సిరీస్‌లు ఆడనుంది. మొహాలీ, ధర్మశాల, పుణె, నవీ ముంబై వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

 Indian Cricket Schedule | ఆఫ్ఘనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్

జూన్ మొదటి వారంలో భారత పురుషుల జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో ఒక టెస్ట్, మూడు వన్డేలు ఉన్నాయి. జూన్ 6 – మొహాలీలో ఏకైక టెస్ట్, అనంతరం ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డేలు ఉండ‌నున్నాయి. ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు కీలక అవకాశంగా భావిస్తున్నారు. జూన్ చివర్లో టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐర్లాండ్ సిరీస్ లో భాగంగా జూన్ 26, జూన్ 28న రెండు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది టీమిండియా. ఆ వెంటనే భారత్ ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరుతుంది. జులై 1 నుంచి జులై 19 వరకు జరిగే ఈ సుదీర్ఘ సిరీస్‌లోఐదు టీ20లు,మూడు వన్డేలు ఆడ‌నుంది. ఇంగ్లాండ్ గడ్డపై పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆధిపత్యం చాటడమే లక్ష్యంగా భారత్ సిద్ధమవుతోంది.

Indian Cricket Schedule | భారత్ జింబాబ్వే పర్యటనకు

జులై చివరి వారంలో భారత్ జింబాబ్వే పర్యటనకు వెళ్లి మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.ఆ తర్వాత ఆగస్టులో శ్రీలంకతో రెండు టెస్టులు, రెండు టీ20లు ఆడ‌నుంది. ఈ సిరీస్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగంగా కీలకంగా మారనుంది. అనంత‌రం వెస్టిండీస్, ఆసియా క్రీడలు, న్యూజిలాండ్ టూర్ ఉండ‌నుంది.ఇక సెప్టెంబర్‌లో స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడ‌నుంది.

అలాగే సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడలు 2026లో భారత జట్టు పాల్గొననుంది. ఏడాది చివర్లో నవంబర్‌లో న్యూజిలాండ్ పర్యటన, డిసెంబర్‌లో స్వదేశంలో శ్రీలంకతో సిరీస్ ఉండటంతో 2026 ద్వితీయార్థం మొత్తం టీమిండియా బిజీ షెడ్యూల్‌తో కొనసాగనుంది. పురుషుల జట్టు మాత్రమే కాకుండా మహిళల జట్లు, అండర్-19, ఇండియా-ఏ జట్లు కూడా వరుస సిరీస్‌లతో బిజీగా ఉండటంతో భారత క్రికెట్ అభిమానులకు రాబోయే నెలలు పూర్తి స్థాయి వినోదాన్ని అందించనున్నాయి.

ఇది కూడా చదవండి..: Amanpreet Singh Gill | క్రికెట్ లోకంలో విషాదం.. విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు అమన్ ప్రీత్ సింగ్ గిల్ కన్నుమూత

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *