Blood Cancer Tragedy | తండ్రిని బలిగొన్న బ్లడ్​ క్యానర్స్​.. పసికందును ముద్దాడకుండానే కన్నుమూసిన వైనం..

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి: Blood Cancer Tragedy | అతనికి ఇద్దరు ఆడపిల్లలు. వారసుని కోసం కలలు కన్నాడు. తనకు కొడుకు పుట్టాలని తాపత్రయ పడ్డాడు. దేవుడు కరుణించి వారసుడిని ఇచ్చాడు. కొడుకు పుట్టడంతో అందరూ సంబరపడ్డారు. కొడుకుతో తనివితీరా ఆడుకోకుండానే బ్లడ్ క్యాన్సర్ (Blood Cancer) అనే మహమ్మారి ఆ తండ్రిని కొడుక్కు దూరం చేసింది. దాంతో “నాన్న” అనే పిలుపు వినకుండానే, కన్న కొడుకును ఒక్కసారి ముద్దాడకుండానే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు.

Blood Cancer Tragedy | ఉన్నట్టుండి కుప్పకూలాడు..

ఈ విషాద ఘటన మాచారెడ్డి మండలం (Machareddy Mandal) లక్ష్మీరావుల పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుట్ట శంకర్​ది (38) రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. 8 ఏళ్ల కూతురు, 3 ఏళ్ల పాపతో బతుకు బండి లాగుతున్న వేళ, 15 రోజుల క్రితం కొడుకు పుట్టాడు. “మగ పిల్లాడు పుట్టాడు, ఇక నా కష్టాలు తీరినట్టే” అని ఊరంతా చెప్పుకున్నాడు. పేరు పెట్టాలని, బారసాల చేయాలని కలలు కన్నాడు. శుక్రవారం ఉదయం కూలి పనికి వెళ్లిన శంకర్, సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు శంకర్​ను హైదరాబాద్‌ తరలించగా డాక్టర్లు బ్లడ్ క్యాన్సర్ చివరి దశ అని చెప్పారు. ఆ మాట వినేలోపే, చికిత్స అందేలోపే శంకర్ ప్రాణం గాల్లో కలిసిపోయింది.

Blood Cancer Tragedy | ఆగమైన కుటుంబం..

కొడుకును ఎత్తుకోలేదు, పేరు పెట్టి పిలవలేదు, నాన్న అని పిలిపించుకోలేదు. అంతలోనే అతని ఊపిరి ఆగిపోయింది. మంచంపై 15 రోజుల పసివాడు. పక్కన భర్త మరణం.. మరోవైపు ఏం జరిగిందో తెలియక నాన్న ఎప్పుడొస్తాడు? అని అడుగుతున్న 6వ తరగతి కూతురు, మూడేళ్ల చిన్నారి మాటలు ఆ తల్లిని కృంగి పోయేలా చేస్తోంది. భర్తే ఆధారంగా బతికిన ఆ తల్లికి, ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని ఎలా సాకాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్క కుటుంబ పెద్ద మరణంతో లక్ష్మీరావులపల్లి (Lakshmi Ravulapalli)లో విషాదఛాయలు అలుముకున్నాయి. క్యాన్సర్ లాక్కెళ్లింది ఒక్క ప్రాణాన్నే కాదు.. ముగ్గురు పిల్లల భవిష్యత్తును, ఒక తల్లి ధైర్యాన్ని కూడా.. అంత్యక్రియలు చేసే చోటకు 15 రోజుల కొడుకును తీసుకుని వస్తే గ్రామస్థులంతా అది చూసి కంటతడి పెట్టుకున్నారు.

ఇది కూడా చదవండి..: Bhujanga Rao Nizamabad | నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా వి. భుజంగరావు నియామకం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *