అక్షరటుడే వెబ్‌డెస్క్: Mines Department Telangana | గనులు , భూగర్భ వనరుల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను, ఉద్యోగుల పదోన్నతులను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని సీఎస్ సంజయ్ జాజు ( Sanjay Jaju )అధికారులను ఆదేశించారు. సిబ్బంది కొరత కారణంగా శాఖ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో శాఖ పనితీరు, పరిపాలనాంశాలు, ఆదాయ సమీకరణ, సిబ్బంది నియామకాలు, పదోన్నతులపై సమగ్రంగా చర్చించారు. ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని మరింత పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
Mines Department Telangana | అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా, అనధికారిక తవ్వకాలు, ఖనిజాల తరలింపును పూర్తిగా అరికట్టాలని సీఎస్ ఆదేశించారు. అక్రమాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నిరంతరం తనిఖీలు చేయాలని, విజిలెన్స్ బృందాలతో ఆకస్మిక దాడులు నిర్వహించి అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. అక్రమ రవాణాపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
Mines Department Telangana | ప్రజలకు మెరుగైన సేవలు..
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా గనులు, భూగర్భ వనరుల శాఖను మరింత సమర్థవంతంగా నడిపించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించేలా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ డి.ఎస్. చౌహాన్, ఐటీఈఅండ్‌సీ జాయింట్ సెక్రటరీ, మైన్స్ డైరెక్టర్ అనుదీప్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ACB Raids Nzb Municipality | నిజామాబాద్ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఇద్దరు సిబ్బంది