అక్షరటుడే వెబ్‌డెస్క్: Morning Eye Swelling | ఉదయం నిద్రలేవగానే చాలామందిలో కళ్లు బరువుగా అనిపించడం, కళ్ల చుట్టూ వాపు రావడం, కళ్లు అలసిపోయినట్లు ఉండటం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. చాలాసార్లు వీటిని మనం సాధారణ విషయంగా భావించి లైట్ తీసుకుంటాం. కానీ రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, ఎక్కువసేపు మొబైల్ లేదా లాప్‌టాప్ స్క్రీన్ చూడడం, కళ్లు పొడిబారడం, అలర్జీల వంటి రకరకాల కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అసలు ఉదయం పూట కళ్ల బరువు, వాపు రావడానికి అసలు కారణాలు ఏమిటి? వాటి నుంచి ఎలా ఉపశమనం పొందాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
Morning Eye Swelling | వాపునకు కారణాలు..
ప్రస్తుత రోజుల్లో రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, పడుకునే ముందు ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు ( Mobile phones ), టీవీలు లేదా కంప్యూటర్లు చూడడం అలవాటుగా మారిపోయింది. దీనివల్ల నిద్ర నాణ్యత దెబ్బతినడమే కాకుండా కళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. స్క్రీన్ చూస్తున్నప్పుడు కనురెప్పలు తక్కువగా ఆర్పుతాం కాబట్టి కళ్లు పొడిబారి అలసటకు గురవుతాయి. ప్రతిరోజూ 7 నుంచి 9 గంటల ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. కళ్లను తేమగా ఉంచే కన్నీటి పొర సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం లేదా త్వరగా ఆవిరైపోవడం వల్ల కళ్లు పొడిబారుతాయి. దీనివల్ల కళ్లలో మంట, దురద, ఎరుపుదనం, ఇసుక పడ్డట్లుగా అనిపించడం, కళ్లు బరువుగా మారడం జరుగుతుంది. కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనిచేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
Morning Eye Swelling | కనురెప్పల వాపు..
ఉదయం లేవగానే కనురెప్పలపై జిగటగా ఉండటం, పొడి పొరలు, దురద, ఎరుపుదనం కనిపిస్తే ‘బ్లెఫరైటిస్’ (కనురెప్పల వాపు) ఉండే అవకాశం ఉంది. అలాగే ఇళ్లలోని దుమ్ము, పుప్పొడి, దిండ్లు , పరుపుల్లో ఉండే డస్ట్ మైట్స్, పెంపుడు జంతువుల వల్ల కూడా కళ్ల చుట్టూ వాపు, అలర్జీ వస్తుంటాయి. తగినంత నిద్రపోయినప్పటికీ రోజూ ఉదయం కళ్ల చుట్టూ వాపు వస్తుంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలో ద్రవాలు నిలిచిపోవడం, కిడ్నీ సమస్యలు లేదా థైరాయిడ్ లోపాల వల్ల కూడా కళ్ల చుట్టూ వాపు రావడానికి అవకాశం ఉంది.
Morning Eye Swelling | కళ్ల వాపు తగ్గాలంటే ..
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఉదయం పూట వచ్చే వాపును తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు పాటించవచ్చు. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఉదయం సకాలంలో మేల్కొనే జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు కనీసం గంట ముందైనా మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల వాడకాన్ని పూర్తిగా ఆపేయాలి. కళ్లపై స్వల్పంగా వాపు ఉంటే, శుభ్రమైన చల్లని వస్త్రంతో కనురెప్పలపై కొన్ని నిమిషాల పాటు కాపడం పెట్టాలి. అయితే నేరుగా మంచు ముక్కలను కళ్లపై పెట్టకూడదు. పరుపులు, దిండ్లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. దురద లేదా మంటగా ఉన్నప్పటికీ కళ్లను గట్టిగా రుద్దడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది.
Morning Eye Swelling | ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
ఉదయం పూట కళ్లు బరువుగా మారడం సాధారణమే అయినప్పటికీ, కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే కంటి నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. అకస్మాత్తుగా చూపు మందగించడం లేదా కోల్పోవడం, భరించలేని తీవ్రమైన కంటి నొప్పి, కంటి చుట్టూ అకస్మాత్తుగా పెద్దదిగా వాపు రావడంతో పాటు ఎరుపుదనం లేదా జ్వరం ఉండటం వంటివి జరిగితే అప్రమత్తం కావాలి. కంటిని కదిలించినప్పుడు నొప్పి రావడం లేదా చూపులో స్పష్టమైన తేడా కనిపించడం, కళ్ల చుట్టూ వాపు నిరంతరంగా అలాగే ఉండటం లేదా తరచుగా పునరావృతం కావడం జరిగితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: Land Issues | దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం : మంత్రి పొంగులేటి