Ultra Processed Foods | చిప్స్, నూడుల్స్ ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

మనకు ఆకలేసినప్పుడు చిప్స్ తినడం, సమయం లేకపోతే ఇన్‌స్టంట్ నూడుల్స్ చేసుకోవడం, దాహమేస్తే సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వంటివి నేటి జీవనశైలిలో సర్వసాధారణమైపోయాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ultra Processed Foods | మనకు ఆకలేసినప్పుడు చిప్స్ తినడం, సమయం లేకపోతే ఇన్‌స్టంట్ నూడుల్స్ చేసుకోవడం, దాహమేస్తే సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వంటివి నేటి జీవనశైలిలో సర్వసాధారణమైపోయాయి. అయితే చిప్స్, ప్యాకెట్ స్నాక్స్, చక్కెర ఎక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్, ఫ్రోజెన్ రెడీ-టు-ఈట్ మీల్స్ లాంటి ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్’ (Ultra-Processed Foods) ఎక్కువగా తింటే మన మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని కెనడాలోని ( Canada  )పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటున్నట్లు వారు గుర్తించారు.

కెనడాలోని ప్రముఖ మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 35 నుంచి 69 ఏళ్ల వయస్సు గల దాదాపు 9 వేల మందిపై చేపట్టిన ఈ అధ్యయన వివరాలు అక్టోబర్ 15న ప్రఖ్యాత ‘జామా నెట్‌వర్క్ ఓపెన్’ (JAMA Network Open) జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Ultra Processed Foods | కీలక విషయాలు..

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినే వారి మెదడు ఎంఆర్ఐ (MRI) స్కాన్లలో చిన్న చిన్న లోపాలు లేదా దెబ్బతిన్న ప్రాంతాలు కనిపించే అవకాశం, వీటిని తక్కువగా తినేవారితో పోలిస్తే 40 శాతం ఎక్కువగా ఉంది. ప్యాకెట్ ఫుడ్స్ ఎక్కువగా తినే మహిళల్లో ఈ తరహా మెదడు మార్పులు కనిపించే అవకాశం తక్కువగా తినే మహిళలతో పోలిస్తే దాదాపు రెండింతలు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ మార్పుల వల్ల వెంటనే జ్ఞాపకశక్తి తగ్గడం లేదా పనుల్లో ఇబ్బందులు రాకపోవచ్చు. కానీ కాలక్రమేణా ఇవి స్ట్రోక్ (పక్షవాతం) లేదా డిమెన్షియా వంటి తీవ్రమైన మెదడు/జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యలకు ముందస్తు సంకేతాలుగా మారవచ్చని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Ultra Processed Foods | పోషకాహారం తగ్గడమే ..

ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి ఆహారపు అలవాట్లను పరిశీలిస్తే.. ప్యాకెట్ ఫుడ్స్ ఎక్కువగా తినే వారి దినచర్యలో సగటున 45 శాతం ఆహారం అల్ట్రా ప్రాసెస్డ్ పదార్థాలే ఉంటున్నాయి. దీనివల్ల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి తాజా పోషకాహారాన్ని వారు చాలా తక్కువగా తీసుకుంటున్నారు. అంతేకాకుండా, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినేవారిలో పొట్ట లోపలి అవయవాల చుట్టూ కొవ్వు (Visceral Fat) పెరిగి, శరీరంలో వాపు మరియు రక్తనాళాల సమస్యలకు దారితీస్తోంది. ఇది నేరుగా మెదడులోని రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది.

Ultra Processed Foods| పరిశోధకుల సూచనలు..

రోజువారీ ఆహారంలో ప్యాకెట్ స్నాక్స్, ఇన్స్టంట్ నూడుల్స్, కూల్ డ్రింక్స్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. ఇంట్లో వండిన తాజా ఆహారం, పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మనం తినే ఆహార ప్రభావం కేవలం బరువు పెరగడంతోనే ఆగిపోదని, అది మన గుండె మరియు మెదడు ఆరోగ్యంతోనూ ముడిపడి ఉందని ఈ అధ్యయనం గుర్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి:  Land Issues | దశాబ్దాల భూ స‌మ‌స్య‌లకు పరిష్కారం : మంత్రి పొంగులేటి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *