అక్షరటుడే వెబ్‌డెస్క్: RBI Interest Rates | దేశంలో వడ్డీ రేట్లను పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ( Sanjay Malhotra ) స్పష్టం చేశారు. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వడ్డీ రేట్ల పెంపుపై జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. ఆర్థిక వ్యవస్థపై చమురు ధరల ప్రభావం , ద్రవ్యోల్బణ పరిస్థితులను ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తోందని, ప్రస్తుత పరిస్థితుల్లో రేట్ల పెంపు నిర్ణయం తొందరపాటే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్ల మార్పు విషయమై తమ వైఖరిని ‘న్యూట్రల్’ నుండి ‘రెస్ట్రిక్టివ్’కు మార్చడం లేదని ఆయన వివరించారు. ఎంపీసీ (MPC) కమిటీ ప్రతి సమావేశంలోనూ దేశ ఆర్థిక పరిస్థితులను సమీక్షించి, సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
RBI Interest Rates | విదేశీ మారక నిల్వలపై ధీమా..
అంతర్జాతీయ అనిశ్చితి, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో రూపాయి విలువ , విదేశీ మారక నిల్వలపై ఆర్‌బీఐ గవర్నర్ సానుకూల ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం ఆర్థిక వ్యవస్థకు మంచి పరిణామం. ఆర్‌బీఐ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు దేశానికి పూర్తి భద్రతను ఇస్తున్నాయని, ఇవి భద్రత, లిక్విడిటీ, రాబడి అనే మూడు ప్రధాన సూత్రాలపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు.
RBI Interest Rates | పెట్టుబడులు..
భారతీయ బాండ్లను గ్లోబల్ ఇండెక్స్‌లలో చేర్చడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూపాయికి మద్దతుగా ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు ఫారెక్స్ మార్కెట్‌ను క్రమబద్ధీకరించాయని, స్పెక్యులేషన్‌ను అరికట్టడంలో ఇవి సత్ఫలితాలనిచ్చాయని వివరించారు. మొత్తంగా, ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని, అనవసరమైన ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Ram Charan New Age Megastar | రామ్ చరణ్‌పై మోడీ ప్రశంసలు.. భావోద్వేగంతో చిరంజీవి ట్వీట్!