RCB vs GT | ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 నేడు.. ఫైనల్ బెర్త్ కోసం ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ మహా పోరు!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RCB vs GT | ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ చివరి దశకు చేరుకున్న వేళ ప్లేఆఫ్స్ సమరం మరింత ఆసక్తికరంగా మారింది. లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు నేడు ప్రతిష్టాత్మక క్వాలిఫయర్-1లో తలపడనున్నాయి.

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేఆఫ్స్ ఫార్మాట్ ప్రకారం టాప్-2 జట్లకు ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు ఉన్నప్పటికీ, తొలి అవకాశాన్నే సద్వినియోగం చేసుకుని ఎలాంటి ఒత్తిడి లేకుండా నేరుగా ఫైనల్‌లో అడుగుపెట్టాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

RCB vs GT | భారీ స్కోర్ న‌మోదయ్యే అవ‌కాశం..

ధర్మశాల పిచ్ సాధారణంగా పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే చిన్న బౌండరీలు ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల బ్యాటర్లు, బౌలర్ల మధ్య ఆసక్తికర పోరు చూడొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్సీబీ బౌలింగ్ విభాగంలో అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్, ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కీలకంగా మారనున్నారు. పవర్‌ప్లేలో వికెట్లు సాధించే సామర్థ్యం ఉన్న ఈ ఇద్దరూ ప్రత్యర్థి టాప్ ఆర్డర్‌ను కట్టడి చేయాలని చూస్తున్నారు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) బౌలింగ్ దళంలో కగిసో రబడా, మహ్మద్ సిరాజ్ ప్రధాన ఆయుధాలుగా ఉన్నారు. ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురావడంలో వీరి పాత్ర కీలకంగా మారనుంది.

RCB vs GT | ఆర్సీబీకి మరో కీలక అంశం ఫిల్ సాల్ట్ ఫిట్‌నెస్

ఇక ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. దూకుడైన ఆటతీరుతో 164 స్ట్రైక్‌రేట్‌తో ఇప్పటికే 550కి పైగా పరుగులు సాధించిన కోహ్లీ, ఈ మ్యాచ్‌లో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అతని బ్యాటింగ్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఆర్సీబీకి మరో కీలక అంశం ఫిల్ సాల్ట్ ఫిట్‌నెస్. గాయం నుంచి కోలుకుని జట్టులో చేరినప్పటికీ, అతను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

RCB vs GT | క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ

ఒకవేళ అతను ఆడకపోతే జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ బలం మాత్రం వారి టాప్ ఆర్డర్. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ ఈ సీజన్‌లో జట్టుకు భారీ పరుగులు అందించారు. ముఖ్యంగా గిల్ అద్భుత ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. గత టీ20 ప్రపంచకప్ ఎంపికల సమయంలో ఎదురైన నిరాశ తర్వాత ఈ సీజన్‌లో మరింత దూకుడుగా కనిపిస్తున్నాడు. నేటి ఈ భారీ సమరంలో ఎవరు విజయం సాధించి నేరుగా ఫైనల్‌కు చేరుకుంటారు? ఎవరు రెండో అవకాశంపై ఆధారపడతారు? అన్నది క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

ఇది కూడా చదవండి..: Kohli Head Controversy | కోహ్లీ–ట్రావిస్ హెడ్ వివాదం కొత్త మలుపు.. ట్రోలింగ్‌పై స్పందించిన జెస్సికా, భావోద్వేగ వ్యాఖ్యలు

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *