Shapoor Zadran HLH | ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న క్రికెట‌ర్‌.. ఐసీయూలో చికిత్స

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shapoor Zadran HLH | ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan)కు చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (shapoor zadran) ప్రస్తుతం ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నారు. హెమొఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ (HLH) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీ (Delhi)లోని ఒక ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల ప్రకారం ఈ వ్యాధి నాలుగో దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యాధి కారణంగా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నియంత్రణ తప్పుతుంది. దాంతో కాలేయం, ప్లీహం, ఎముక మజ్జ వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటాయి. ఫలితంగా రోగి పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదం ఉంటుంది. గత ఏడాది అక్టోబర్‌లో అనారోగ్యానికి గురైన షాపూర్‌కు మెరుగైన చికిత్స కోసం భారత్‌కు రావాలని వైద్యులు సూచించారు. ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మిర్వాయిస్ అష్రఫ్, స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ సహకారంతో వీసా ప్రక్రియ వేగంగా పూర్తయింది. అనంతరం ఈ ఏడాది జనవరి 18న ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరారు.

Shapoor Zadran HLH | ఆందోళ‌న‌లో అభిమానులు..

షాపూర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు ఘమై జద్రాన్ వెల్లడించిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అతని శరీరం మొత్తం తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌తో నిండిపోయిందని, టీబీ కూడా సోకిందని చెప్పారు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్‌లలో ఇన్‌ఫెక్షన్ మెదడుకు కూడా వ్యాపించినట్లు గుర్తించారు. షాపూర్‌కు అండగా నిలిచేందుకు ఆఫ్ఘన్ క్రికెట్ వర్గాలు సహాయం అందిస్తున్నాయి. రషీద్ ఖాన్ (Rashid Khan) ఢిల్లీలో మ్యాచ్ ఉన్నప్పుడు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించగా, మాజీ కెప్టెన్ అస్ఘర్ ఆఫ్ఘన్ (Asghar Afghan) కూడా చికిత్స వ్యవహారాలను చూసుకుంటున్నారు.మార్చి చివర్లో నిర్వహించిన పరీక్షల్లో షాపూర్‌కు స్టేజ్-4 హెచ్‌ఎల్‌హెచ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స తర్వాత కొంతకాలం ఆరోగ్యం మెరుగుపడినా, మళ్లీ ఇన్‌ఫెక్షన్ తిరగబెట్టింది.

Shapoor Zadran HLH

Shapoor Zadran HLH | చికిత్సకు కొంత మెరుగైనట్టు

తర్వాత డెంగ్యూ (Dengue) సోకడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ప్రస్తుతం స్టెరాయిడ్ చికిత్స కొనసాగుతుండగా, దానికి శరీరం స్పందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇస్తున్న చికిత్సకు కొంత మెరుగైనట్టు కనిపిస్తోంది. అతను కోలుకుంటాడనే నమ్మకం ఉంది” అని ఆయన సోదరుడు ఆశాభావం వ్యక్తం చేశాడు. షాపూర్ జద్రాన్ 2009 నుంచి 2020 వరకు ఆఫ్ఘనిస్థాన్ తరఫున 44 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. తన వేగంతో, అగ్రెసివ్ బౌలింగ్‌తో జట్టుకు మంచి సేవలు అందించాడు. ప్రస్తుతం ప్రాణాల కోసం పోరాడుతున్న ఈ క్రికెటర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి..: Bengal Young Voters | యువ ఓటర్ల చుట్టూ రాజకీయ హామీలు.. పశ్చిమ బెంగాల్​లో వారే 40 శాతం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *