SIBM Hyderabad Award | గ్రామీణ మహిళల సాధికారతపై పరిశోధన.. గ్లోబల్ వేదికపై ఎస్ఐబీఎం-హైదరాబాద్ అరుదైన ఘనత

సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్ (ఎస్ఐబీఎం-హెచ్) అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: SIBM Hyderabad Award | సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, హైదరాబాద్ (ఎస్ఐబీఎం-హెచ్) అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐవీ పబ్లిషింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘2026 ఐవీ విమెన్ ఇన్వెస్టింగ్ ఇన్ లీడర్‌షిప్ (IWIL)’ కేస్ రైటింగ్ పోటీలో సంస్థకు చెందిన ఒక అధ్యాపకుడు, ఒక విద్యార్థి కలిసి రూపొందించిన టీచింగ్ కేస్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో పాటు వారు 2,000 అమెరికన్  ( US )డాలర్ల నగదు బహుమతిని గెలుచుకున్నారు. 19 దేశాల నుంచి 50 విద్యాసంస్థలకు చెందిన 157 మంది రచయితలు సమర్పించిన 78 కేస్ స్టడీలతో పోటీపడి ఎస్ఐబీఎం-హెచ్ ఈ విజయాన్ని సాధించడం విశేషం.

SIBM Hyderabad Award | సాధికారతపై విశ్లేషణ..

భారతదేశ చేతివృత్తి ఆహార ఆర్థిక వ్యవస్థలో మహిళల జీవనోపాధికి స్థిరత్వం’ అనే అంశంపై ఈ కేస్ స్టడీని రూపొందించారు. ఒక వ్యాపార సంస్థ వృద్ధి చెందుతున్నప్పుడు, దాని విజయంలో కీలక పాత్ర పోషించిన గ్రామీణ మహిళలకు ఆ ఆర్థిక ప్రయోజనాల్లో సరైన వాటా దక్కుతుందా లేదా అనే మౌలిక ప్రశ్నను ఇది చర్చిస్తుంది. చేతితో పచ్చళ్లు తయారు చేసే గ్రామీణ మహిళల జీవనోపాధి, యాజమాన్య హక్కులు, నిర్ణయాధికారం , లింగ సమానత్వం వంటి కీలక అంశాలను ఈ కేస్ స్టడీ మేనేజ్‌మెంట్ తరగతి గది చర్చలకు తీసుకొచ్చింది.

SIBM Hyderabad Award | పరిశోధనలకు పెద్దపీట..

వాస్తవ వ్యాపార సవాళ్ల ఆధారంగా రూపొందించే టీచింగ్ కేస్‌ల ద్వారా విద్యార్థులలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సంస్థలోని ‘కేస్ డెవలప్‌మెంట్ సెంటర్’ కృషి చేస్తోంది. ఈ సందర్భంగా ఎస్ఐబీఎం హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె. పి. వేణుగోపాల రావు మాట్లాడుతూ.. అధ్యాపకులు, విద్యార్థుల మధ్య ఉన్న సమన్వయానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, సమకాలీన వ్యాపార సవాళ్లను పరిష్కరించే దిశగా పరిశోధనలు సాగాలని, భవిష్యత్తుకు సిద్ధమైన మేనేజర్లను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

SIBM Hyderabad Award | అంతర్జాతీయ గుర్తింపు..

పరిశోధన , నైపుణ్యాభివృద్ధిలో ఎస్ఐబీఎం-హైదరాబాద్ వేగంగా దూసుకెళ్తోంది. గత రెండేళ్లలో స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్ జర్నళ్లలో సంస్థ అధ్యాపకుల 179 పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా 2025 మేలో ‘ఫ్రాంటియర్స్ ఇన్ కమ్యూనికేషన్’లో ప్రచురితమైన ఒక పరిశోధనా పత్రానికి 95 వేలకు పైగా వ్యూస్, 8,430 డౌన్‌లోడ్‌లు లభించాయి. మరోవైపు, పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దడంతో 2026 బ్యాచ్‌లో 96 శాతం మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్లు సాధించారు. ఇందులో అత్యధిక వార్షిక ప్యాకేజీ (సీటీసీ) రూ. 26 లక్షలుగా నమోదు కాగా, సగటు ప్యాకేజీ రూ. 9.6 లక్షలుగా నిలిచింది.

ఇది కూడా చదవండి: Telangana Fancy Number Rules | వాహనదారులకు అలర్ట్.. ఫ్యాన్సీ నంబర్ల గడువు 30 రోజులకు తగ్గింపు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *