Smit Machchhar Flydubai | నువ్వు నిజమైన హీరో.. మచ్చార్ సాహసంపై ప్రధాని మోదీ ప్రశంసలు

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ (flydubai) విమానంలో ఊహించని విపత్తు చోటుచేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Smit Machchhar Flydubai | దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ (flydubai) విమానంలో ఊహించని విపత్తు చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను సురక్షితంగా కాపాడారు. ఆయన ధైర్యసాహసాలను అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు.

Smit Machchhar Flydubai | ఏం జరిగిందంటే..?

ఫ్లైదుబాయ్‌కి చెందిన ఎఫ్‌జెడ్ 1073 (FZ1073) విమానం దుబాయ్ నుంచి బయలుదేరింది. అయితే విమానం ప్రయాణంలో ఉండగా కాక్‌పిట్‌లో అనూహ్యంగా గొడవ మొదలైంది. కో-పైలట్ కెప్టెన్‌పై కత్తితో దాడి చేశాడని, ఆ వెంటనే క్యాబిన్ సిబ్బంది అప్రమత్తమై కాక్‌పిట్‌లోకి ప్రవేశించారని రాయిటర్స్ పేర్కొంది. ఒక పైలట్ మరొకరిపై దాడి చేసి విమానాన్ని కూల్చేసేందుకు ప్రయత్నించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా వెల్లడించారు.

ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. దుబాయ్ నుంచి బయలుదేరిన రెండున్నర గంటల తర్వాత విమానం నుంచి ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. కేవలం ఒక్క నిమిషంలోనే విమానం 33,000 అడుగుల ఎత్తు నుంచి ఏకంగా 17,000 అడుగుల కిందకు పడిపోతూ, జోర్డాన్ సరిహద్దు వద్ద విచిత్రమైన మలుపులు తిరిగింది.

Smit Machchhar Flydubai | సురక్షిత ల్యాండింగ్..

గాయపడినప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్చార్ తన ప్రాణాలను లెక్కచేయకుండా చాకచక్యంగా వ్యవహరించడంతో విమానం సౌదీ అరేబియాలోని తబూక్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో గొడవ జరిగిన మాట వాస్తవమేనని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఫ్లైదుబాయ్ సంస్థ ధ్రువీకరించింది. దాడిలో గాయపడిన కెప్టెన్‌తో పాటు మరో పైలట్‌ను తబూక్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

Smit Machchhar Flydubai | ప్రధాని మోదీ ప్రశంసలు..

కెప్టెన్ స్మిత్ ప్రదర్శించిన సాహసాన్ని కొనియాడిన ప్రధాని మోదీ, ఆయనను నిజమైన హీరోగా అభివర్ణించారు. ప్రాణాపాయ స్థితిలో కూడా వెనుకాడకుండా ఇతరుల ప్రాణాలను కాపాడాలనే ఆయన నిశ్చయం అద్భుతమని, స్మిత్ సాహసమే పెద్ద ప్రమాదాన్ని తప్పించిందని పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, భారత్ ఎంతో గర్విస్తోందని ప్రధాని తెలిపారు.

ఇది కూడా చదవండి:  Kerala University Clash | ఎస్​ఎఫ్​ఐ, యూత్​ కాంగ్రెస్​ నాయకుల ఘర్షణ.. కేరళ యూనివర్సిటీలో ఉద్రిక్తత

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *