అక్షరటుడే వెబ్‌డెస్క్: South India Protein | భారతదేశంలో ప్రొటీన్ అవసరాలపై జాతీయ స్థాయిలో అవగాహన కొరవడినప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలు మాత్రం రోజువారీ డైరీ వినియోగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచాయని ఓ నూతన కన్స్యూమర్ అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా ఇళ్లలో లభించే పాలు, పెరుగు, పన్నీర్ వంటి సులభంగా జీర్ణమయ్యే డైరీ ఉత్పత్తుల్లో నాణ్యమైన ప్రొటీన్ లభిస్తుంది. ఈ విషయంలో దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాది ప్రజలు సహజంగానే ముందున్నారు.
South India Protein | అవగాహనా లోపమే..
దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని ధనిక కుటుంబాలపై నిర్వహించిన సర్వేలో విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. దాదాపు ముగ్గురిలో ఇద్దరు (మూడు వంతుల మంది) ప్రొటీన్ లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. ఆరోగ్యకరమైన వయోజనుడు శరీర బరువు ప్రకారం ప్రతి కేజీకి 0.66 నుంచి 0.83 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సిఫార్సు చేస్తుండగా.. 93 శాతం మందికి అసలు రోజువారీ ప్రొటీన్ ఎంత అవసరమో సరిగ్గా తెలియదని సర్వే స్పష్టం చేసింది. అంటే మన ప్లేట్లో ఆహారం లేకపోవడం సమస్య కాదని, అందులో ఉన్న ప్రొటీన్‌ను గుర్తించడంలోనే అవగాహన లోపించిందని నిపుణులు చెబుతున్నారు.
South India Protein | దక్షిణాదిలోనే అధికం..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సగం మంది కూడా రోజూ పాలు లేదా పెరుగును తీసుకోకపోగా, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఈ సగటు (48.8%) కంటే వినియోగం గణనీయంగా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పురుషులు 77.1%, మహిళలు 74.8% చొప్పున డైరీ ఉత్పత్తులను వినియోగిస్తుండగా, కర్ణాటకలో పురుషులు 76.2% మరియు మహిళలు 77.9%తో ముందున్నాయి. అలాగే తెలంగాణలో పురుషులు 68.9%, మహిళలు 71.3% ఉండగా, కేరళలో పురుషులు 62.5%, మహిళలు 59.4% చొప్పున రోజూ డైరీ ఉత్పత్తులను ఉపయోగిస్తూ దక్షిణాదిని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నాయి.
South India Protein | అగ్రస్థానంలో దక్షిణాది..
దక్షిణాదిలో 18 నుంచి 39 సంవత్సరాల మధ్య వయస్సు గల పట్టణ వినియోగదారులపై నిర్వహించిన ‘ఇండియా లాక్టోగ్రాఫ్’ అధ్యయనం మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టింది. ఈ ప్రాంతంలో 80.1 శాతం మంది పెరుగును రోజూ క్రమం తప్పకుండా వినియోగిస్తున్నట్లు తేలింది. అయితే ఇక్కడో విచిత్రమైన పరిస్థితి ఉంది. పిల్లలకు పాలు ఇస్తే ప్రొటీన్ అందుతుందని తల్లిదండ్రులు బలంగా నమ్ముతున్నప్పటికీ.. పెద్దలు మాత్రం తమ విషయంలో ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. భోజనంలో పెరుగు, పన్నీర్ ఉన్నప్పటికీ, చాలామంది ప్యాకేజెడ్ ప్రొటీన్ షేక్‌ల వైపే మొగ్గు చూపుతున్నారు.
“దక్షిణాది ప్రజలు తరతరాలుగా డైరీ ఉత్పత్తుల ద్వారానే తమ ప్రొటీన్‌ను పొందుతున్నారు. అయితే, తమ ప్లేట్లో ఉన్న పోషకాహారాన్ని గుర్తించలేకపోతున్నారని, ఈ అవగాహన లోపాన్ని సరిదిద్దడంలో ఈ ప్రాంతం అగ్రగామిగా నిలవగలదని” ఇండియా లాక్టోగ్రాఫ్ సీఈఓ గౌరవ్ పాండే పేర్కొన్నారు.
జాతీయ పోషకాహార వారోత్సవాల నేపథ్యంలో.. పోషకాహార లోపాలను సరిదిద్దడానికి అన్ని మార్కెట్లలో ఒకే రకమైన వ్యూహం అవసరం లేదని ఈ డేటా స్పష్టం చేస్తోంది. దక్షిణాదిలో ఇప్పటికే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పదార్థాలు ఇళ్లలో అందుబాటులో ఉన్నాయి. కేవలం వాటిపై పూర్తి అవగాహన పెంచుకుంటే చాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Russia Tariff Bill | ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయం.. రష్యా ఆంక్షల బిల్లులో భారత్ పేరు