అక్షరటుడే వెబ్‌డెస్క్: Russia Tariff Bill | రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అమెరికా ( US )సర్కార్ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా భారత్, చైనా సహా పలు దేశాలపై భారీ టారిఫ్‌లు విధించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లును ఈ వారం ప్రతినిధుల సభ ముందుకు తీసుకురానున్నారు. ఈ బిల్లులో రష్యా వాణిజ్య భాగస్వామ్య దేశాల జాబితాలో భారత్ పేరును ప్రత్యక్షంగా చేర్చాలని డెమోక్రాటిక్ పార్టీ చట్టసభ్యులు ప్రతిపాదించడం గమనార్హం.
దివంగత సెనెటర్ లిండ్సే గ్రాహమ్ పేరు మీదుగా తెచ్చిన ‘శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ను అమెరికా సెనెట్ ఇప్పటికే 86-11 ఓట్ల తేడాతో ఆమోదించింది. అయితే, తొలి దశలో ఈ బిల్లులో రష్యాతో వ్యాపారం చేసే దేశాల పేర్లను నేరుగా ప్రస్తావించకుండా.. కేవలం చమురు, గ్యాస్ దిగుమతి చేసుకునే టాప్-5 దేశాలుగా మాత్రమే పేర్కొన్నారు. తాజాగా ఈ నిబంధనను సవరించాలని డెమోక్రాట్లు కోరుతున్నారు.
Russia Tariff Bill | భారత్ సహా పలు దేశాలు..
భారత్‌తో పాటు చైనా, తుర్కియే, అజర్‌బైజాన్, హంగేరీ, స్లోవేకియా, యూఏఈ, సింగపూర్, కజకిస్థాన్, కిర్గిస్థాన్ దేశాల పేర్లను 100 శాతం టారిఫ్‌లు ఎదుర్కొనే జాబితాలో స్పష్టంగా చేర్చాలని డెమోక్రాటిక్ పార్టీ ప్రతినిధి స్టేనీ హోయర్ ప్రతిపాదించారు. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన తర్వాత, అమెరికా అధ్యక్షుడి సంతకంతో ఈ బిల్లు పూర్తి స్థాయి చట్టరూపం దాల్చనుంది. నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందే దీన్ని ఆమోదింపజేసుకోవాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.
Russia Tariff Bill | బిల్లు ప్రధాన ఉద్దేశం..
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని తక్షణమే ముగించేలా మాస్కోపై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకే అగ్రరాజ్యం ఈ కఠిన ఆంక్షల బిల్లును తెచ్చింది. రష్యా ఇంధన ప్రాజెక్టులు, ఆర్థిక సంస్థలు, అధికారులను లక్ష్యంగా చేసుకున్న ఈ బిల్లు ద్వారా.. మాస్కో నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకునే దేశాలపై అసాధారణ స్థాయిలో సుంకాలు విధించే పూర్తి అధికారం అమెరికా అధ్యక్షుడికి లభించనుంది.
ఇది కూడా చదవండి: Monkey Menace | కోతుల ఎఫెక్ట్.. కనుమరుగు అవుతున్న చెట్లు