అక్షరటుడే, వెబ్‌డెస్క్: Monkey Menace | రాష్ట్రంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అంతటా కోతుల సంఖ్య భారీగా పెరిగింది.
కోతుల బెడదతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా తినే వస్తువు పట్టుకొని రోడ్డుపై వెళ్తుంటే కోతులు వచ్చి లాక్కొని వెళ్తున్నాయి. చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. అంతేగాకుండా పంట పొలాలను సైతం కోతులు ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు (Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని సార్లు తరిమినా మళ్లీ వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Monkey Menace | చెట్లు ఉంటే..
గ్రామాల్లో గతంలో ప్రతి ఇంటి ఎదుట చెట్లు ఉండేవి. పచ్చదనం కళకళలాడేది. అయితే చెట్లు ఉంటే కోతులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ప్రజలు తమ ఇళ్ల ఎదుట ఉన్న చెట్లను కొట్టేస్తున్నారు. పంట పొలాల్లో సైతం చెట్లను తొలగిస్తున్నారు. చెట్లు ఉంటే కోతులు వాటిపై తిష్ట వేస్తున్నాయి. రైతులు వెళ్లగానే కిందకు దిగి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు ఏమి చేయాలో తెలియక చెట్లను నరికి వేస్తున్నారు. దీంతో పొలాల్లో నీడనిచ్చే చెట్లు కరువు అవుతున్నాయి.
Monkey Menace | పట్టించుకోని అధికారులు
రాష్ట్రంలో కోతుల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు. ఓ వైపు మొక్కలు నాటాలని, చెట్లు పెంచాలని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు కోతుల మూలంగా చెట్లు అంతరించిపోతున్నా స్పందించడం లేదు. గతంలో చెట్లతో కళకళలాడిన పొలం గట్లు నేడే.. ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. మరోవైపు కోతుల దాడుల్లో నిత్యం ఎంతో మంది గాయపడుతున్నారు. అయినా అధికారులు కోతుల బెడద నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రజలు కోతులను పట్టించి.. ఇతర ప్రాంతాల్లో వదిలేస్తున్నా.. మళ్లీ వస్తున్నాయి. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Revanth Aga Khan | సీఎం రేవంత్‌రెడ్డితో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ