అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Aga Khan | హైదరాబాద్‌లోని ( Hyderabad )చారిత్రాత్మక తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్ర వారసత్వ సంపద పరిరక్షణ, మూసీ నది పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి , రాబోయే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వంటి పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Revanth Aga Khan | చారిత్రక కట్టడాల పునరుద్ధరణ..
ఈ సందర్భంగా అగా ఖాన్ ఫౌండేషన్‌పై తమకు ఎంతో గౌరవం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోని చారిత్రక సంపదను పరిరక్షించడంలో ఈ ఫౌండేషన్ కీలక భూమిక పోషిస్తోందని కొనియాడారు. వారి సహకారంతోనే ఇటీవలే శాసనమండలి భవనంతో పాటు కుతుబ్ షాహీ టూంబ్స్‌ను అద్భుతంగా పునరుద్ధరించుకున్నామని గుర్తుచేశారు.
Revanth Aga Khan | మూసీ నది పునరుజ్జీవనం..
మూసీ నదిని నైట్ ఎకానమీకి అనుగుణంగా ఆధునీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సీఎం తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలోని చారిత్రాత్మక సిటీ కాలేజ్ , ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణ పనుల్లో అగా ఖాన్ ఫౌండేషన్ సహకారం అందించాలని కోరారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో సరికొత్త భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న పాత భవనాన్ని మాత్రం వారసత్వ సంపదగా సంరక్షించి తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందని వివరించారు.
Revanth Aga Khan | గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానం..
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు రావాల్సిందిగా ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. వందకు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొననున్న ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా మారుస్తున్నామన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 2047 నాటికి 10 శాతానికి చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
సుమారు 30 వేల ఎకరాల విశాల విస్తీర్ణంలో, ఎయిర్‌పోర్టుకు కేవలం 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. సింగపూర్ సంస్థ రూపొందిస్తున్న ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా 15 వేల ఎకరాలను ప్రత్యేకంగా గ్రీన్ జోన్‌గా కేటాయించామని, దీనిని పూర్తిగా ‘నెట్-జీరో సిటీ’గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అమెజాన్ వంటి గ్లోబల్ దిగ్గజ సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Hit and Run Case | గుర్‌గ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడి అరెస్ట్