అక్షరటుడే, కామారెడ్డి: Gampa Govardhan Protest | అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని, సీఎం రేవంత్ రెడ్డికి మహిళల ఉసురు తప్పక తగులుతుందని కామారెడ్డి (Kamareddy) మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం కామారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
Gampa Govardhan Protest | రైల్వే కమాన్ వద్ద..
పట్టణంలోని రైల్వే కమాన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత ఒక్కసారిగా రైల్వే కమాన్ పైకి ఎక్కి బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు కమాన్‌పై నిరసన కొనసాగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. నిరసన విరమించకపోవడంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యేను బలవంతంగా లేపి ఆయన కారులో ఎక్కించి ఇంటికి పంపే ప్రయత్నం చేశారు. దీన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. కారు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు కార్యకర్తలను పక్కకు తప్పించి కారును అక్కడి నుంచి పంపించారు.
Gampa Govardhan Protest | రాష్ట్రంలో అరాచక పాలన..
గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. 420 హామీలను ప్రశ్నించేందుకు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళితే అడ్డుకోవడం దారుణమన్నారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ మోసపూరిత, అలవికాని హామీలు ఇచ్చిందని విమర్శించారు. ఒక మహిళా ఎమ్మెల్యే చీర లాగడం, మరో మహిళా ఎమ్మెల్యే గొంతు పట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. బాధ్యులైన పోలీసులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ముజీబోద్దీన్, మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Bodhan Congress BRS Clash | బోధన్‌లో ఉద్రిక్తత.. బాహాబాహికి దిగిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు