Kamareddy Rain Alert | వర్షాల నేపథ్యంలో పోలీసుల అప్రమత్తం.. పలు రహదారుల మూసివేత

కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Rain Alert | జిల్లాలో(Kamareddy ) కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా పోలీసులు(Kamareddy police) అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు వాగులు, వంతెనలు, లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారుల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Kamareddy Rain Alert | మాచారెడ్డి పోలీస్​స్టేషన్​ పరిధిలో..

మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాల్వంచ వంతెన సమీపంలో పాత రహదారిపై నీటి ప్రవాహం ఉండటంతో ప్రజలు అక్కడికి వెళ్లకుండా గ్రామపంచాయతీ ట్రాక్టర్లను ఇరువైపులా ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. అక్కడ పోలీసు సిబ్బందిని మోహరించి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఫరీద్‌పేట్–వాడి గ్రామాల మధ్య ఉన్న లోట్టి వాగు వద్ద నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న అడ్డంకులను జేసీబీతో తొలగించి నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి గంగమ్మ వాగు వద్ద ప్రస్తుతం నీటి ప్రవాహం సాధారణంగా ఉన్నప్పటికీ, ముందుజాగ్రత్తగా ఒక సిబ్బందిని విధుల్లో ఉంచారు. రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.

11

Kamareddy Rain Alert | లింగంపేట గ్రామ సమీపంలో..

లింగంపేట్(Lingampet) గ్రామ సమీపంలోని కేకేవై ప్రధాన రహదారిపై భారీ మర్రిచెట్టు పడిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన పోలీసులు జేసీబీ సాయంతో చెట్టును తొలగించి రహదారిని క్లియర్ చేసి వాహన రాకపోకలను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. వర్షాల సమయంలో ప్రజలు వాగులు, వంతెనలు, ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని దాటవద్దని, సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే డయల్-100కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

Kamareddy Rain Alert | గర్గుల్-రామారెడ్డి రోడ్డు బ్లాక్.. 10 కి.మీ చుట్టూ తిరిగి వెళ్తున్న ప్రజలు

1 1

కామారెడ్డి నుంచి రామారెడ్డి వెళ్లే దారిలో గర్గుల్ రామారెడ్డి మధ్య గల గంగమ్మ వాగుపై ప్రభుత్వం రూ.3 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఏళ్ల పాటు నిధులు రాక బ్రిడ్జి నిర్మాణం మధ్యలోనే నిలిచిపోగా వర్షాకాలంలో బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న మట్టి రోడ్డు కొట్టుకపోగా ప్రమాదాలు సంభవించాయి. దాంతో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక చొరవతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా బ్రిడ్జిపై మట్టిరోడ్డు తప్ప తారురోడ్డుకు గ్రహణం పట్టుకుంది.

భారీ వర్షాలకు లారీ..బస్సు..

2

ప్రస్తుతం భారీవర్షాల నేపథ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మట్టిరోడ్డు కొట్టుకుపోయి బ్రిడ్జిపై రహదారిపై లారీ, బస్సు దిగబడిపోయాయి. దాంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఆ దారిని తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతం కామారెడ్డి నుంచి రామారెడ్డి వెళ్లే ప్రజలు గొల్లపల్లి, పోసానిపేట గ్రామాల నుంచి సుమారు 10 కి.మీ చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దూరం పెరగడంతో ఆర్టీసీ బస్సులో రూ.10, ఆటోలలో రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారు. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి గంగమ్మ వాగుపై రోడ్డు పనులు పూర్తి చేసి ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి : Annapurna Studios’ #Pallaburusu Teaser Out Now.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *