అక్షరటుడే వెబ్డెస్క్: Bala Tripura Sundari Devi | తెలంగాణ ( Telangana ), ఆంధ్రప్రదేశ్ సహా తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శక్తి స్వరూపిణి అయిన జగన్మాతను ఈ తొమ్మిది రోజుల పాటు భక్తులు వివిధ రూపాల్లో కొలవనున్నారు. ముఖ్యంగా విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ దేవస్థానంలో దసరా ఉత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని రోజూ అమ్మవారి అలంకార విశేషాలు, నైవేద్యాల వివరాలు ఇలా ఉన్నాయి.
Bala Tripura Sundari Devi | బాలాత్రిపురసుందరీదేవి అలంకారం..
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో మొదటి రోజున అమ్మవారు ‘శ్రీ బాలాత్రిపురసుందరీదేవి’ అలంకారంలో భక్తులకు అభయమిస్తారు. సమస్త శుభాలను ప్రసాదించే ఈ దివ్యమంగళ రూపంలో అమ్మవారు మూడేళ్ల బాలికలా కనిపిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు చతుర్భుజాలతో (నాలుగు చేతులతో) దర్శనమిస్తారు. ఒక చేతిలో జపమాల, మరో చేతిలో పుస్తకం ధరించి.. మిగతా రెండు చేతులతో అభయ, వరద హస్తాలను చూపుతూ భక్తులను కరుణిస్తారు. కలువ పువ్వులో ఆమె ఆసీనురాలై ఉంటారు.
షోడశ విద్యలకు ఈమే అధిష్టాన దేవత. శ్రీవిద్యోపాసకులు ముందుగా ఈ బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపురసుందరీదేవి కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. శ్రీచక్రంలోని తొలి దేవతగా బాలాదేవిని పూజిస్తారు.
Bala Tripura Sundari Devi | పూజా విధానం..
ఈ రోజున భక్తులు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. నిష్టతో ‘లలితా త్రిశతి’ పారాయణ చేస్తారు. ఈ అమ్మవారిని ఆరాధిస్తే సర్వ సంపదలు చేకూరుతాయని, మానసిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
అమ్మవారికి మొదటి రోజు ఎంతో ప్రీతిపాత్రమైన పాయసం, పులగం ప్రసాదంగా నివేదిస్తారు. ఈ రోజు అమ్మవారికి లేత గులాబీ (Light Pink) రంగు వస్త్రాన్ని అలంకరిస్తారు. అమ్మవారి అర్చన కోసం అన్ని రకాల పూలను ఉపయోగిస్తారు.
ఇది కూడా చదవండి: Eagle Force | గోవా నుంచి డ్రగ్స్ రవాణా.. ముఠా గుట్టురట్టు చేసిన ఈగల్ ఫోర్స్