అక్షరటుడే, కామారెడ్డి: KCR Kamareddy District | కామారెడ్డిని జిల్లాగా మార్చి అభివృద్ధికి బాటలు వేసిన కేసీఆర్ను జిల్లా ప్రజలు ఎప్పటికి మర్చిపోరని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Gampa Govardhan) అన్నారు. కామారెడ్డి (Kamareddy) జిల్లా ఏర్పడి పదేళ్లు అయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను తన నివాసం వద్ద నిర్వహించారు.
KCR Kamareddy District | ఉద్యమకారులకు సన్మానం
ఉత్సవాలకు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సహా కామారెడ్డి నియోజకవర్గంలోని తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఉద్యమకారులను మాజీ ఎమ్మెల్యేలు సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న జిల్లాలతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని దూరదృష్టితో ఆలోచన చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు పాలన చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని, కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సబ్బండ వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. కరెంట్, యూరియా కోసం రైతులు అల్లాడుతున్నారని, 10, 15 రోజుల్లో పంటలు కోతకు వస్తాయని, కరెంట్ సమస్యతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు.
KCR Kamareddy District | టీడీపీలో ఉండి ఇబ్బందులకు గురయ్యా
తెలంగాణ ఉద్యమం సమయంలో తాను టీడీపీలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులకు గురయ్యానన్నారు. ఉద్యమకారులు ఎక్కడికక్కడ తనను అడ్డుకునే వారని గుర్తు చేసుకున్నారు. 2001 టీఆర్ఎస్ ఆవిర్భవించిందని, 2009 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు టీఆర్ఎస్ టీడీపీ పొత్తులో ఉన్నాయన్నారు. అంతకుముందు తన పార్టీలోకి రావాలని కేసీఆర్ ఆహ్వానిస్తే ఆలోచించి నిర్ణయం చెప్తానని చెప్పానని, ఎన్నికల్లో టికెట్ ఇచ్చే సమయంలో కేసీఆర్ చంద్రబాబు కలిసి మాట్లాడుకుని పొత్తులో భాగంగా కామారెడ్డి అసెంబ్లీ టికెట్ తనకు కేటాయిస్తే 48వేల భారీ మెజారిటీతో గెలుపొందానని గుర్తు చేసుకున్నారు. ఉద్యమ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. ఆ తర్వాత 2011లో టీఆర్ఎస్లో చేరానని తెలిపారు. తెలంగాణలో ధూందాం అనే పదం పుట్టినదే కామారెడ్డిలో అని గుర్తు చేశారు. అలాంటి కామారెడ్డిలో 14సార్లు ఓటమి ఎరుగని కేసీఆర్ ఓటమి పాలవడం దురదృష్టకరమన్నారు. ఈ ఓటమి కామారెడ్డికి తీరని మచ్చగా మిగిలిందని, అది తొలగిపోయేలా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు.
KCR Kamareddy District | వారిని దగ్గరికి రానివ్వను
పదేళ్ల పాటు పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారిన ద్రోహులను తన వద్దకు తిరిగి రానిస్తానని కార్యకర్తలు, ఉద్యమకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఆ విషయంలో ఎలాంటి అనుమానాలు, భయాలు వద్దన్నారు. వారిని ఎప్పటికి తన వద్దకు రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. చాలా మంది గ్రామస్థాయి క్యాడర్ తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్నారని, ఉద్యమకారులు, కార్యకర్తల అభిప్రాయాన్ని కాదని ఎవరిని చేరుకోలేనని, వారి నిర్ణయమే ఫైనల్ అని, తాను బ్రతికున్నంత కాలం ఇదే మాటపై ఉంటానని తేల్చి చెప్పారు.
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించే అవకాశం కల్పించారు
కామారెడ్డిని కొత్త జిల్లాగా ప్రకటించి జిల్లాను ప్రగతి పథంలో నడిపించే అవకాశం కేసీఆర్ కల్పించారని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. తన నియజకవర్గంలో 102 ఉన్న జీపీలు 168 గా మారాయని, కొత్తగా మూడు మండలాలు ఏర్పాటయ్యాయని, జిల్లాలో డివిజన్లను ఏర్పాటు చేశారన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వంలా అనిపించిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఆంధ్ర ప్రభుత్వంలో ఉన్నట్టుగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రా నాయకులు వారి ప్రాంతాలకు నిధులు తీసుకుని వెళ్లి అభివృద్ధి చేసుకునే వారని, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నిధులు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో తెలియడం లేదన్నారు.
ఇది కూడా చదవండి: పవన్ సంచలన వ్యాఖ్యలు