ATM Theft Telangana | రెచ్చిపోతున్న ఏటీఎం దొంగలు.. రూ.లక్షల్లో నగదు క్షణాల్లో మాయం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం దొంగల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: ATM Theft Telangana | ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఏటీఎం దొంగల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జిల్లా సరిహద్దులు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఆనుకుని ఉండటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు సులభంగా వచ్చి చోరీలకు పాల్పడి పరారవుతున్నాయి. గత ఏడాది కాలంగా జిల్లాలో నమోదైన చోరీలను పరిశీలిస్తే ఇదే అర్థమవుతోంది.

ATM Theft Telangana | నిఘా కరువైందా..?

దొంగలు వినూత్న రీతిలో చోరీలు చేస్తున్నారు. గ్యాస్ కట్టర్ ఉపయోగిస్తూ డబ్బులు రాకపోతే ఏకంగా మిషన్లనే ఎత్తుకెళ్తున్నారు. గత రెండేళ్లలో జరుగుతున్న ఘటనలో రూ.లక్షల్లో దుండగులు కొల్లగొట్టిన ఘటనలు ఉన్నాయి. వరుస ఘటనలతో ఏటీఎంల వద్ద నిఘాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ATM Theft Telangana | గ్యాస్ కట్టర్ సాయంతో..

దొంగలు ఇప్పుడు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఏటీఎం మిషన్​ను పగలగొట్టేందుకు గ్యాస్ కట్టర్లను వాడుతున్నారు. గతేడాది జనవరి 12న బిచ్కుంద మండల కేంద్రంలో తెల్లవారుజామున వచ్చిన నలుగురు దుండగులు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి ఏకంగా రూ.3.95 లక్షల నగదుతో సహా ఏటీఎం మిషన్​నే వాహనంలో ఎత్తుకెళ్లారు. అదే రోజు పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో మరో ముఠా చోరీకి పాల్పడింది. ఏటీఎం లోపల ఉన్న సీసీటీవీ కెమెరాపై స్ప్రే కొట్టి, గ్యాస్ కట్టర్​తో ఏటీఎంను కట్ చేసి రూ.17 లక్షలు దోచుకెళ్లారు. తాజాగా గాంధారి మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి 1.21 గంటలకు స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు పోలీసుల కళ్లుగప్పేందుకు నైటీలు వేసుకుని వచ్చారు. గ్యాస్ కట్టర్​తో ఏటీఎంను కట్ చేసి అందులో నగదు ఉన్న బాక్సులను ఎత్తుకెళ్లారు.

ATM Theft Telangana | రూ. లక్షల్లో నగదు మాయం

జిల్లాలో జరుగుతున్న ప్రతి చోరీ లక్షల్లోనే ఉంటోంది. గతేడాది డిసెంబర్ 27న నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్​లో దొంగలు బరితెగించారు. ఒకే రోజు.. కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఎస్బీఐ, డీసీబీ బ్యాంకులకు చెందిన రెండు ఏటీఎంలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ రెండు చోట్ల కలిపి సుమారు రూ.40 లక్షల వరకు దోచుకెళ్లారు. ఈ ఘటనలో దొంగలు ఫేక్ నంబర్ ప్లేట్ ఉన్న కారులో వచ్చి, మాస్కులు ధరించి చోరీకి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది.

ATM Theft Telangana |  ఏటీఎం కార్డులు మార్చి నగదు అపహరణ

పెద్ద మొత్తంలో దోపిడీలే కాకుండా, ఏటీఎం కేంద్రాల వద్దకు వచ్చే అమాయక ప్రజలను మోసం చేసి నగదు కాజేసే ఘటనలు కూడా పెరిగాయి. కామారెడ్డి పట్టణంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తికి సాయం చేసే నెపంతో అతని కార్డును మార్చి, అతని ఖాతా నుంచి రూ.40 వేలు కాజేశారు. ఇదే తరహాలో మాచారెడ్డి మండలంలో ఓ రైతు ఏటీఎంకు వెళ్లగా, అక్కడే మాటు వేసిన దుండగులు రైతు కార్డును కొట్టేసి, ఇతర ప్రాంతాల్లో నగదు డ్రా చేశారు. దీంతో బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో కామారెడ్డిలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో రిపేర్ చేయడానికి వచ్చామని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు కాజేసిన ఘటన కూడా ఉంది.

కట్టడి చేయడంలో విఫలం..

జిల్లాలో వరుస చోరీలు జరుగుతున్నా బ్యాంకర్లు, పోలీసులు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని చాలా ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులు లేరు. ఉన్నా కూడా రాత్రి వేళల్లో ఉండటం లేదు. సీసీటీవీ కెమెరాలు చాలా చోట్ల పనిచేయడం లేదు. అలారం వ్యవస్థలు కూడా నిర్వీర్యంగా మారాయి. రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ కూడా సరిగా లేకపోవడంతో దొంగలకు ఇది వరంగా మారిందన్న ప్రచారం సాగుతోంది. చోరీ జరిగిన తర్వాత హడావుడిగా క్లూస్ టీమ్​తో విచారణ చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, ముందస్తు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: జిమ్ జిమ్ తారా ట్రెండ్..అనుపమ సినిమా ప్రమోషన్.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *