అక్షరటుడే వెబ్‌డెస్క్: Stage 2 Kidney Disease | ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో కిడ్నీల పనితీరు మందగించడం ఒకటి. కిడ్నీ వ్యాధుల ప్రారంభ దశలో లక్షణాలు బయటకు కనిపించవు, కాబట్టి చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, సరైన సమయంలో రొటీన్ టెస్టులు చేయించుకోవడం ద్వారా ఈ సమస్యను ముందే గుర్తించి, తగిన చికిత్సతో ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు.
Stage 2 Kidney Disease | స్టేజ్-2 కిడ్నీ వ్యాధి అంటే ఏమిటి?
కిడ్నీ వ్యాధిలో ‘స్టేజ్-2’ అనేది మూత్రపిండాలకు స్వల్పంగా నష్టం జరిగిన దశ. ఈ దశలో శరీరంలోని వ్యర్థాలను వడకట్టే సామర్థ్యం (eGFR రేటు) 60-89 మధ్య ఉంటుంది. చాలా సందర్భాల్లో లక్షణాలు బయటకు కనిపించనందున, దీనిని గుర్తించడం సవాలుగా మారుతుంది. రక్త పరీక్షలు (క్రియాటినిన్, eGFR), యూరిన్ టెస్టులు , అల్ట్రాసౌండ్ వంటి పరీక్షల ద్వారా మాత్రమే దీనిని నిర్ధారించవచ్చు.
Stage 2 Kidney Disease | గమనించాల్సిన లక్షణాలు..
కిడ్నీ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను పంపుతుంది. ముఖ్యంగా, మూత్ర విసర్జనలో మార్పులు కనిపించడం , యూరిన్ ముదురు రంగులోకి మారడం వంటివి ప్రాథమిక లక్షణాలు. దీనితో పాటు విపరీతమైన అలసట, నీరసం , రక్తపోటు (బీపీ) అదుపు తప్పడం వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ద్రవాలు నిలిచిపోవడం వల్ల కాళ్లు, చేతుల్లో వాపులు (ఎడీమా) రావడం, వీపు భాగంలో నిరంతరం నొప్పిగా అనిపించడం వంటివి జరుగుతుంటాయి. అలాగే, నిద్రలేమి సమస్యలతో పాటు చర్మం పొడిబారడం లేదా తీవ్రమైన దురద వంటి లక్షణాలు కూడా కిడ్నీ పనితీరు మందగించినప్పుడు కనిపిస్తుంటాయి. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కిడ్నీలో రాళ్లు , యూరినరీ ఇన్ఫెక్షన్లు వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Stage 2 Kidney Disease |నివారణ , చికిత్స..
స్టేజ్-2లో జరిగిన నష్టాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడం సాధ్యం కాకపోయినప్పటికీ, వ్యాధి తీవ్రత పెరగకుండా కచ్చితంగా ఆపవచ్చు. ఇందుకోసం కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. ఆహారంలో ఉప్పు (సోడియం) తగ్గించాలి. ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండి, తాజా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవాలి. క్రమ తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం , ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం ఎంతో అవసరం. డయాబెటిస్ , బీపీ ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవడానికి వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి.
ఈ జాగ్రత్తలు పాటిస్తే, వ్యాధి తీవ్రమైన స్టేజ్-3కి వెళ్లకుండా కాపాడుకోవచ్చు. ఏవైనా అనుమానాలు ఉన్నా లేదా లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: Murder Case Verdict | హత్య కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష