Supreme Court AI | న్యాయవ్యవస్థలో ఏఐ వాడకం.. నకిలీ తీర్పుల వినియోగంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యాయ ప్రక్రియల్లో కృత్రిమ మేధ (AI) వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Supreme Court AI | న్యాయ ప్రక్రియల్లో కృత్రిమ మేధ (AI) వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏఐ సృష్టించిన సమాచారాన్ని సరైన ధృవీకరణ లేకుండా న్యాయస్థానాల్లో వాడటం న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. చట్టపరమైన తీర్పుల కోసం ఏఐని ఉపయోగించడం వల్ల వచ్చే కల్పిత సమాచారాన్ని, న్యాయ వ్యవస్థలో మిథైల్ ఐసోసైనెట్ వంటి అత్యంత విషపూరితమైన పదార్థంతో పోల్చింది.

Supreme Court AI | కోర్టు మార్గదర్శకాలు..

న్యాయవాద వృత్తిలో , తీర్పుల ప్రక్రియలో ఏఐ వాడకాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)ని కోర్టు ఆదేశించింది. ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నప్పుడు న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇద్దరూ చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏఐ సహాయపడగలదే కానీ, అది మనిషి నిర్ణయాలను ఎప్పటికీ భర్తీ చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. న్యాయ ప్రక్రియలో ఎల్లప్పుడూ మానవ పర్యవేక్షణ ఉండాలని కోరింది. ధృవీకరణ లేని ఏఐ తీర్పులను కోర్టుల్లో సమర్పించడం న్యాయవాదుల పక్షాన దుష్ప్రవర్తనగా పరిగణిస్తుందని కోర్టు తేల్చి చెప్పింది.

Supreme Court AI | ఎస్సెల్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ కేసు..

ఎస్సెల్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ దివాలా కేసును విచారించిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT), నకిలీ , ఏఐ సృష్టించిన ఉనికిలో లేని తీర్పుల ఆధారంగా తన నిర్ణయాన్ని తీసుకుందని సుప్రీంకోర్టు గుర్తించింది. ఈ తీర్పును NCLAT కూడా సమర్థించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నకిలీ సమాచారం నిర్ణయ ప్రక్రియలోకి కొద్దిగా ప్రవేశించినా, ఆ తీర్పు పవిత్రత దెబ్బతింటుందని కోర్టు పేర్కొంది. కాబట్టి, NCLT , NCLAT ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసును వాస్తవ ఆధారాలతో మొదటి నుంచి కొత్తగా విచారించాలని ట్రిబ్యునల్‌ను ఆదేశించింది. ఏఐ టెక్నాలజీలో ఉండే సాంకేతిక లోపాలను సరిదిద్దడం శాస్త్రవేత్తల పని అని, కానీ న్యాయ వ్యవస్థలో నకిలీ సమాచారాన్ని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి:  Indiramma Housing Tenders | క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో టెండర్లు: మంత్రి పొంగులేటి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *