అక్షరటుడే వెబ్‌డెస్క్: Hormuz Strait Crisis | ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఒమన్ కారిడార్ గుండా వెళ్తున్న ఒక భారతీయ చమురు ట్యాంకర్‌ను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బలగాలు అడ్డుకుని, వెనక్కి పంపినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ‘ఫార్స్’ వెల్లడించింది.
Hormuz Strait Crisis | ఇరాన్ హెచ్చరికలు..
అంతర్జాతీయ నౌకాయాన సంస్థ (IMO) , అమెరికా పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ‘ఒమన్ కారిడార్’ను కాకుండా, తాము నిర్దేశించిన మార్గంలోనే విదేశీ నౌకలు ప్రయాణించాలని ఇరాన్ కఠిన హెచ్చరికలు జారీ చేస్తోంది. బుధవారం ఉదయం ఈ ప్రాంతం గుండా వెళ్లిన నౌకలన్నీ ఇరాన్ సూచించిన మార్గంలోనే వెళ్లాయని సమాచారం. అయితే, ఈ ఘటనపై భారత్, అమెరికా లేదా ఒమన్ వర్గాల నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
Hormuz Strait Crisis | అమెరికా భీకర దాడులు..
గడిచిన 24 గంటల్లో హర్మూజ్ జలసంధిలో కతార్, సౌదీ అరేబియాకు చెందిన వాణిజ్య నౌకలపై దాడులు జరగడంతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ దాడులకు స్పందనగా అమెరికా రంగంలోకి దిగింది. ఇరాన్‌కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు, కోస్టల్ రాడార్ కేంద్రాలు , సుమారు 60కి పైగా IRGC చిన్నపాటి యుద్ధ నౌకల లక్ష్యంగా అమెరికా బలగాలు భీకర దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, ఇరాన్‌కు గతంలో ఇచ్చిన చమురు విక్రయాల లైసెన్స్‌ను కూడా అమెరికా రద్దు చేసింది.
Hormuz Strait Crisis | అప్రమత్తమైన భారత్..
ఈ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో, భారతీయ నౌకల సురక్షిత ప్రయాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇరాన్ అధికారులతో అత్యున్నత స్థాయి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జలసంధిలో భద్రతపై భారత్ ముందస్తు చర్యలు చేపట్టింది.
ఇది కూడా చదవండి: Anganwadi Jobs | నిరుద్యోగ మహిళలకు గుడ్‌న్యూస్.. అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల