Supreme Court | నీట్​ నిరసనల్లో పోలీసుల తీరుపై విచారణ అవసరం: సుప్రీంకోర్టు

ఆందోళనల సమయంలో పోలీసులకు కొత్త నియమావళి అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Supreme Court | ఆందోళనల సమయంలో పోలీసులకు కొత్త నియమావళి అవసరమని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. పోలీసులు గతంలో నిర్దేశించిన నియమాలను పాటించలేదని కూడా తెలిపింది.

ఢిల్లీ (Delhi)లో ఈ నెల 20న విద్యార్థులపై లాఠీచార్జీ చేసిన వారిపై చర్యలు తీసుకొవాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం చీఫ్​ జస్టిస్​ సూర్యకాంత్ (CJI Suryakant)​ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విన్నది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనల సందర్భంగా జరిగిన సంఘటనలపై నిష్పక్షపాతమైన, స్వతంత్ర విచారణ జరగాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ఆందోళనలు అనివార్యమని, దేశవ్యాప్తంగా జరిగే ప్రజా ప్రదర్శనలు, నిరసనలపై పోలీసుల స్పందనను నియంత్రించడానికి ఒక స్పష్టమైన ప్రొటోకాల్ అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు.

Supreme Court | 250 మంది పోలీసులకు గాయాలు

కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విద్యార్థులపై బలప్రయోగం జరిగితే కేంద్రం ఆ విషయాన్ని తేలికగా తీసుకోదన్నారు. ఈ ఘటనలో 250 మంది పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారని తెలిపారు. నిజం బయటకు తీసుకురావడానికి సరైన విచారణ జరపాలని కోరారు. విద్యార్థులు హింసకు పాల్పడ్డారని తాను నమ్మడం లేదన్నారు. సంఘ విద్రోహ శక్తులు ఆ బృందంలోకి చొరబడి ఉండాలని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన డేటాను కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.

Supreme Court | ఆందోళనలు సహజం

నీట్ పేపర్ లీక్, ఇతర పరీక్షా అవకతవకలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దురాగతాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యంలో ఆందోళనలు జరగడం సహజం అని వ్యాఖ్యానించింది. నిరసనలు, పోలీసుల చర్యలను నియంత్రించేందుకు ఒకే విధమైన ప్రొటోకాల్‌ను అమలులోకి తెచ్చిన తర్వాత “ఎవరైతే దురాగతాలకు పాల్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారో, ఎవరైతే అఘాయిత్యాలకు పాల్పడ్డారో, వారిని తప్పక చట్ట పరిధిలోకి తీసుకురావాలి” అని పేర్కొంది. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా హింసాత్మక ఘటనలపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తామని సూచించింది.

దీనిని కూడా చదవండి : Meta Apologizes | పీఎం మోదీ వీడియో నిలిపివేత.. క్షమాపణ చెప్పిన మెటా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *