అక్షరటుడే, వెబ్డెస్క్ : Tamil Nadu Farmer Cases | అసెంబ్లీలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (Joseph Vijay) కీలక ప్రకటన చేశారు. తమ జీవనోపాధి, హక్కులు, న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలిపినందుకు రైతులు, ఉపాధ్యాయులపై మే 2021 నుంచి ఏప్రిల్ 2026 వరకు నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకుంటామని తెలిపారు.
ప్రజాస్వామ్య హక్కులను గౌరవిస్తూ, మానవతా దృక్పథంతో, ప్రజాస్వామ్య సూత్రాల ఆధారంగా కేసులు రద్దు చేయాలని నిర్ణయించినట్లు విజయ్ తెలిపారు. తమ ప్రభుత్వం రైతులు, ఉపాధ్యాయులకు అండగా నిలుస్తుందన్నారు. తిరువన్నామలై జిల్లాలో, సిప్కాట్ తోజిర్‌పేటకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్న రైతులపై కేసులు నమోదు చేశారన్నారు. పరందూరులో వ్యవసాయ భూములు, నీటి వనరులు, జీవనోపాధి కోల్పోతామనే భయంతో రైతులు కొత్త విమానాశ్రయ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరంతరం నిరసన తెలిపారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం వారిపై అమానవీయంగా కేసులు నమోదు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకుంటామన్నారు.
Tamil Nadu Farmer Cases | తాగునీటి కోసం నిధులు
తాగునీటి కోసం ఉత్తర చెన్నై, ఆవడి, పొన్నేరి, మింజూర్ ప్రాంతాల అవసరాలను తీర్చడానికి మింజూర్‌లో 400 ఎంఎల్‌డి సామర్థ్యం గల డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని విజయ్ తెలిపారు. గృహాలకు 24 గంటల తాగునీటి సరఫరా అందించేందుకు ఆవడి మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ. 500 కోట్ల కొత్త పథకాన్ని కూడా అమలు చేస్తామని ప్రకటించారు. మదురై, కడలూరు మున్సిపల్ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీలు, 20 టౌన్ పంచాయతీలలో తాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడానికి రూ. 1,000 కోట్లు కేటాయించారు.
ఇది కూడా చదవండి..: Kashmir BJP Protest | కశ్మీర్లో బీజేపీ నాయకుల భారీ నిరసన