TMC Rebel MLA | మమత బెనర్జీకి షాక్​.. ప్రతిపక్ష నేతగా టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TMC Rebel MLA | బెంగాల్​లో అధికారం కోల్పోయిన బాధలో ఉన్న మమత బెనర్జీకి మరో షాక్​ తగిలింది. ఆమె పార్టీ టీఎంసీ (TMC) రెండుగా చిలీపోయింది. ప్రతిపక్ష నేతగా టీఎంసీ రెబల్​ ఎమ్మెల్యే రిటబ్రత బెనర్జీ (Ritabrata Banerjee) ఎన్నికయ్యారు.

బెంగాల్​లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీఎంసీ 80 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అయితే ఆ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో తృణమూల్ పార్టీ నుంచి బహిష్కరించబడిన ఎమ్మెల్యే రిటబ్రత బెనర్జీకి 60 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతూ లేఖ సమర్పించారు. దీంతో ప్రతిపక్ష నేతగా స్పీకర్​ ఆయనను గుర్తించారు. నకిలీ సంతకాల వివాదం చెలరేగిన నేపథ్యంలో జరిగిన ఈ తిరుగుబాటు అనంతరం విలేకరులతో మాట్లాడిన రిటబ్రత, మమతా బెనర్జీయే తమ నాయకురాలని, పార్టీని చీల్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

TMC Rebel MLA | మేమే ప్రధాన ప్రతిపక్షం

రిటబ్రత బెనర్జీ 2018లో తృణమూల్ పార్టీలో చేరారు. ఆయనకు తాజాగా ప్రతిపక్ష నాయకుడికి కేటాయించిన ఛాంబర్ తాళాలను అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మేమే ప్రధాన ప్రతిపక్షం. మేము ఒక బృందంగా పోరాడాము” అని పేర్కొన్నారు. పార్టీ పగ్గాలు తన చేతిలోనే ఉంచుకుంటూ, ఎప్పటిలాగే మాకు సలహాలు ఇస్తూ ఉండాలని తాను మమతా బెనర్జీ (Mamata Banerjee)ని కోరుతానని చెప్పారు. మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై పరోక్షంగా ఆయన విమర్శలు చేశారు. తమ ఈ చర్యను వ్యక్తి ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా సాగించిన సామూహిక పోరాటంగా ఆయన అభివర్ణించారు.

TMC Rebel MLA | మమతను ధిక్కరిస్తూ..

పార్టీ నాయకత్వాన్ని ధిక్కరిస్తూ ఏకంగా 58 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు స్పీకర్ రతీంద్రనాథ్ బోస్‌కు ఒక లేఖను సమర్పించి, రిటబ్రతను ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపాదించారు. తమ వర్గాన్నే TMC “నిజమైన” శాసనసభ పక్షంగా గుర్తించాలని ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. టీఎంసీ ఎమ్మెల్యేలు జావేద్ ఖాన్, సందీపన్ సాహా, సబీనా యాస్మిన్, షెయులి సాహాలను సభలో ఉప నాయకులుగా నియమించారు. అఖ్రుజ్జమాన్‌ను పార్టీ ప్రధాన విప్‌గా ప్రకటించారు. గత వారం టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో స్పీకర్‌కు ఒక లేఖ రాస్తూ, శోభన్‌దేవ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నాయకుడిగానూ, ఫిర్హాద్ హకీమ్‌ను ప్రధాన విప్‌గానూ ప్రతిపాదించారు.

TMC Rebel MLA | మమత నాయకత్వంలో..

శోభన్‌దేవ్‌కు మద్దతు ఇస్తున్నట్లుగా చూపిన పలువురు ఎమ్మెల్యేల సంతకాలు నకిలీవని రిటబ్రత, సందీపన్ ఆరోపించడంతో స్పీకర్ ఆ ప్రతిపాదనను ఆమోదించలేదు. ఈ క్రమంలో సోమవారం తృణమూల్ పార్టీ రిటబ్రత, సందీపన్‌లను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ ఈ చర్యకు గల కారణాన్ని స్పష్టంగా వెల్లడించనప్పటికీ, ఈ ఎమ్మెల్యేలు పార్టీలో చీలిక తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ బహిష్కరణ జరిగింది. అయితే సస్పెండ్​ అయిన రిటబ్రత తాజాగా ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికవడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు మమత నాయకత్వాన్ని సవాలు చేయడం లేదన్నారు. తాము TMC జెండా కిందనే పనిచేస్తామని స్పష్టం చేశారు.

దీనిని కూడా చదవండి: Delhi Restaurant Fire | ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *