అక్షరటుడే వెబ్‌డెస్క్: UPI MDR Charges | యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి రానుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు తీవ్ర చర్చకు దారితీశాయి. సామాన్యుల జేబుకు చిల్లు పడనుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman )స్పష్టతనిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి:
UPI MDR Charges| సామాన్యులపై భారం పడదు..
రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుందనే ప్రచారంపై వస్తున్న ఊహాగానాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఖండించారు. సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. రూ.2,000 కంటే తక్కువ ఉండే లావాదేవీలకు ఈ ఛార్జీలు వర్తించవని తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై రాజకీయం చేయడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఇలాంటి రూమర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
UPI MDR Charges | MDR అంటే ఏమిటి?
యూపీఐ ద్వారా వసూలు చేసే ఎండీఆర్ అనేది ఎలాంటి పన్ను లేదా సెస్ కాదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ మొత్తం ప్రభుత్వ ఖాతాలోకి లేదా కన్సోలిడేటెడ్ ఫండ్‌లోకి చేరదు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, యూజర్లకు మెరుగైన సేవలు అందించడానికి సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమే ఈ ఛార్జీలను స్వీకరిస్తారు. ఇది కేవలం యూపీఐ ఆపరేటర్ల మధ్య ఉండే అంతర్గత రుసుము మాత్రమేనని, దీని భారాన్ని వినియోగదారులపై మోపే ప్రసక్తే లేదని వివరించారు.
UPI MDR Charges| ప్రత్యేక మినహాయింపులు..
ఈ విధానంలో వేర్వేరు కేటగిరీలు ఉన్నాయి. రూ.2,000 దాటిన పేమెంట్లపై సాధారణంగా 0.4 శాతం వసూలు చేసినప్పటికీ, అన్ని లావాదేవీలకూ ఇది వర్తించదు. ఉదాహరణకు, ఫ్లాట్-రేట్ మోడల్ కిందకు వచ్చే పెట్రోల్ బంక్ లావాదేవీల వంటి వాటికి గరిష్టంగా రూ.5 మాత్రమే ఫిక్స్‌డ్ ఎండీఆర్‌గా వసూలు చేస్తారు. అంతేకాకుండా, నెలకు రూ.1,00,000 వరకు లావాదేవీలు నిర్వహించే చిన్న వ్యాపారులకు ఊరటనిస్తూ వారిని ‘జీరో ఎండీఆర్’ కేటగిరీలో ఉంచారు. దీనివల్ల చిన్న వ్యాపారులు ఎలాంటి అదనపు రుసుమూ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
UPI MDR Charges| క్షేత్రస్థాయిలో గందరగోళం ..
అక్టోబర్ 15 నుంచి ఈ కొత్త ఛార్జీల నిబంధన అమల్లోకి రానున్నప్పటికీ, ఇప్పటినుంచే క్షేత్రస్థాయిలో దీని ప్రభావం కనిపిస్తోంది. తమ లాభాల మార్జిన్ తగ్గిపోతుందన్న ఆందోళనతో వర్తకులు, వ్యాపారుల్లో గందరగోళం మొదలైంది. ముఖ్యంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో యూపీఐ ద్వారా కాకుండా నగదు (క్యాష్) చెల్లించాలంటూ వినియోగదారులపై ఒత్తిడి వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ తరహా మార్పులు ఇప్పుడే కనిపిస్తున్నప్పటికీ, దీనివల్ల జరిగే అసలు నిజమైన ప్రభావం ఏమిటనేది అక్టోబర్ 15న ఛార్జీలు అమల్లోకి వస్తేనే పూర్తిగా స్పష్టమవుతుంది.
ఇది కూడా చదవండి: India Women Gold Medal | ఆసియా గేమ్స్ ఫైనల్లో ఘన విజయం.. భారత్ ఖాతాలో తొలి పసిడి