అక్షరటుడే వెబ్‌డెస్క్: 22A Land Restrictions | 22ఏ (22A) నిషేధిత జాబితాలో పట్టా భూములు పొరపాటుగా చేరిన అంశంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivas Reddy )స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు అన్యాయం చేయదని, ప్రతి ఒక్కరి ఆస్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
22A Land Restrictions | సాంకేతిక లోపంతోనే పొరపాటు..
హైకోర్టు ఆదేశాల మేరకు 22ఏ నిషేధిత భూముల వివరాలను ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో దారితీసిన క్షేత్రస్థాయి పొరపాట్లను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సవరిస్తోందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో వివిధ జీవోలు, మెమోల ద్వారా క్రమబద్ధీకరించిన ప్రైవేట్ భూములు, హైకోర్టు, జీహెచ్‌ఎంసీ (GHMC), హెచ్‌ఎండీఏ (HMDA) అనుమతులు పొందిన స్థలాలు ఆన్‌లైన్ లోపాల వల్ల ఈ జాబితాలో చేరాయని వివరించారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా తప్పును పారదర్శకంగా అంగీకరించి, తక్షణమే సరిదిద్దే చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ఈ సమస్య పరిష్కార ప్రక్రియ ప్రారంభమైందని, ఒక్క మేడ్చల్ జిల్లాలోనే 30, రంగారెడ్డి జిల్లాలో 4 వంతున రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని వెల్లడించారు.
22A Land Restrictions | ప్రత్యేక కమిటీ ఏర్పాటు..
రాష్ట్రంలో 22ఏ సమస్యల సత్వర పరిష్కారం కోసం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి ప్రకటించారు. రాబోయే 15 రోజుల పాటు ఈ కమిటీ రోజువారీగా దరఖాస్తులను పరిశీలించి, సరైన ప్రైవేట్ ఆస్తులన్నింటినీ తక్షణమే క్లియర్ చేస్తుందని తెలిపారు.
22A Land Restrictions | విమర్శలపై ఘాటు స్పందన..
22ఏ భూముల తొలగింపునకు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. తప్పు జరిగిందని తాము బహిరంగంగా ఒప్పుకుని సరిదిద్దుతున్నామని, పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ధరణి ద్వారా ప్రజలు పడ్డ ఇబ్బందులకు ఆనాడు వారు ఎప్పుడైనా బాధ్యత తీసుకున్నారా అని ప్రశ్నించారు. పేదల సమస్యలను రాజకీయ లబ్ధి కోసం వాడటం మానుకోవాలని హితవు పలికారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. తాను రెండు దశాబ్దాలుగా వ్యాపార రంగంలో ఎదిగానని, ఫీనిక్స్, రాఘవ వంటి సంస్థలతో లావాదేవీలు జరగడం సహజమని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, దమ్ముంటే నిజమైన ఆధారాలు ప్రజల ముందు పెట్టాలని సవాల్ విసిరారు.
ఇది కూడా చదవండి: ACB Case | అటవీ శాఖ అధికారులపై ఏసీబీ కేసు