అక్షరటుడే వెబ్‌డెస్క్: AP Bhavan Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )ప్రభుత్వం తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకం ప్రక్రియ కొలిక్కి రావడంతో, ఢిల్లీలోని ఏపీ సొంత స్థలంలో అత్యాధునిక హంగులతో కొత్త భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
AP Bhavan Delhi | అత్యాధునిక సదుపాయాలు..
దాదాపు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 105 కోట్ల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ పరిపాలనా కేంద్రంగా , అతిథి గృహంగా (Hospitality Center) బహుముఖ సేవలను అందించనుంది. ఢిల్లీకి వచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అధికారులు , ప్రజాప్రతినిధులందరికీ ఒకే చోట అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా ఏపీ సంస్కృతి, సంప్రదాయాలు ఈ భవన నిర్మాణంలో ప్రతిబింబించేలా ప్రత్యేక డిజైన్లను రూపొందించారు.

AP Bhavan Delhi | ఎన్బీసీసీకి నిర్మాణ బాధ్యతలు..
నాణ్యతకు, పారదర్శకతకు , నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేయడంలో మంచి పేరున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్’ (NBCC)కి ఈ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని అత్యున్నత ప్రమాణాలతో ఈ భవనాన్ని నిర్మించేందుకు NBCC సిద్ధమైంది.
AP Bhavan Delhi | త్వరలో శంకుస్థాపన..
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి మరికొద్ది రోజుల్లోనే భూమి పూజ , శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kodad SI Suspended | కోదాడ రూరల్ ఎస్సైపై వేటు