Supreme Court SIR Verdict | విపక్షాలకు ఎదురుదెబ్బ.. ఎస్​ఐఆర్​ను సమర్థించిన సుప్రీంకోర్టు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Supreme Court SIR Verdict | సుప్రీంకోర్టులో విపక్షాలకు ఎదురుదెబ్బ తగిలింది. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత పునర్విమర్శ (SIR) చట్టబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. SIR స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలనే రాజ్యాంగ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.

బీహార్‌లో SIR నిర్వహించేందుకు గత ఏడాది జూన్‌లో ఈసీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ తీర్పును వెలువరించింది. SIR ప్రక్రియకు, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల లక్ష్యంతో సంబంధం ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సమగ్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల సవరణ ప్రజా ప్రాతినిధ్య చట్టానికి జీవం పోస్తుందని కోర్టు తీర్పు ఇచ్చింది.

Supreme Court SIR Verdict | చట్ట ప్రకారమే..

బీహార్, పలు ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన SIR ప్రక్రియ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జయమాల బాగ్చి, విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎన్నికల సంఘానికి (Election Commission) చట్టం ఎస్​ఐఆర్​ కోసం అధికారం ఇచ్చిందని న్యాయమూర్తులు తెలిపారు. సాధారణ పద్ధతులకు ఇది అన్ని విధాలుగా అనుగుణంగా లేదనే కారణంతో మాత్రమే సదరు ప్రత్యేక పునర్విమర్శను చెల్లనిదిగా ప్రకటించలేమని స్పష్టం చేశారు. సదరు ప్రత్యేక పునర్విమర్శ ప్రజా ప్రాతినిధ్య చట్టం, నియమాలను భర్తీ చేయదన్నారు. ఇది సెక్షన్ 21(3) ద్వారా అందించబడిన కచ్చితమైన చట్టబద్ధమైన పరిధిలో, ఆర్టికల్ 324 కింద రాజ్యాంగ ఆదేశానికి జీవం పోస్తుందని తెలిపారు. అందువల్ల ఎన్నికల కమిషన్ తన చట్టబద్ధమైన అధికారాలను అతిక్రమించిందని చెప్పలేమని స్పష్టం చేశారు.

Supreme Court SIR Verdict | 40 ఏళ్ల క్రితం..

చివరి సమగ్ర సవరణ జరిగి నాలుగు దశాబ్దాలకు పైగా గడిచిపోవడం, సంవత్సరాలుగా పెద్ద ఎత్తున చేర్పులు, తొలగింపులు జరగడం, వేగవంతమైన పట్టణీకరణ వలసల కారణంగా ఓటర్ల జాబితాలలో పునరావృతం, తప్పులు ఏర్పడే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి సమయంలో ఎన్నికల సంఘం నమోదు చేసిన కారణాలు, ఆ ప్రాథమిక సమగ్రతను పరిరక్షించడమే లక్ష్యంగా స్పష్టంగా ఉన్నాయని తెలిపింది. ఈసీ అనుసరించిన విధానం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నియమావళి 1960కి విరుద్ధంగా ఉందన్న వాదనను కోర్టు తిరస్కరించింది.

Supreme Court SIR Verdict | ఆ అధికారం ఉంది

ఓటర్ల జాబితాలో చేర్చడం కోసం పౌరసత్వానికి సంబంధించిన ప్రశ్నలను పరిశీలించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని కోర్టు పేర్కొంది. ఈసీ ప్రతికూల నిర్ధారణ, ఆ వ్యక్తి భారత పౌరుడు కాదని నిశ్చయాత్మకమైన నిర్ధారణకు దారితీయదని స్పష్టం చేసింది. ఈసీ చర్య కేవలం ఓటర్ల జాబితా తయారీకి మాత్రమే పరిమితం అని పేర్కొంది. కోర్టు ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను నిలిపివేయలేదని, ఇది బీహార్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లలో పూర్తయిందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: TMC MLA Defection | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. టీఎంసీలో భారీ అసంతృప్తి? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *