అక్షరటుడే వెబ్‌డెస్క్: Lokesh Women Reservation | తెలుగుదేశం పార్టీ (TDP) వార్షిక పండుగ ‘మహానాడు 2026’ వేదికగా ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా(Nara Lokesh) లోకేశ్ ఊహించినట్లుగానే ఒక సంచలన ప్రకటన చేశారు. ఈ ఉదయం ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్న ‘భారీ ప్రకటన’ (Big Announcement) ఇదేనని స్పష్టమైంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి మహానాడును ఉద్దేశించి ప్రసంగించిన లోకేశ్.. రాబోయే ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట వేయబోతున్నట్లు ప్రకటించారు.
Lokesh Women Reservation | మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్..
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా.. 2029 వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. సమాజంలో స్త్రీ శక్తిని గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత, ప్రోత్సాహం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఏపీ రాజకీయ చరిత్రలోనే ఇదొక సరికొత్త అధ్యాయానికి అంకురార్పణ కానుంది.

Lokesh Women Reservation | వైఎస్ జగన్‌కు లోకేశ్ సవాల్..
మహానాడు వేదికగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు. 2019-2024 మధ్య కాలంలో వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. “గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమంపై నాతో చర్చించడానికి మీరు సిద్ధమా? డేట్, టైమ్ మీరే నిర్ణయించండి.. నేను వస్తా” అని లోకేశ్ ఛాలెంజ్ చేశారు. గత ఐదేళ్ల కాలంలో టీడీపీ శ్రేణులు శారీరకంగా, మానసికంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నారని, తనపైనే ఏకంగా 23 తప్పుడు కేసులు పెట్టి వేధించారని లోకేశ్ గుర్తుచేశారు. అయినా సరే వెనకడుగు వేయకుండా ముందడుగు వేశామన్నారు.

Lokesh Women Reservation | వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు..
వైసీపీ వైఖరిపై లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “వైనాట్ 175” అన్న వాళ్లను ప్రజలు కేవలం 11 సీట్లకే (టీమ్ 11) పరిమితం చేశారని, 8 ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్ చేసిందని ఎద్దేవా చేశారు. మహానాడు హైబ్రిడ్ విధానాన్ని ఎగతాళి చేసిన వారికి ప్రధాని మోదీ పిలుపుతోనే దీనిని డిజిటల్ మరియు భౌతిక (Hybrid) పద్ధతిలో నిర్వహిస్తున్నామని సమాధానమిచ్చారు. ఆన్లైన్ అయినా, ఆఫ్ లైన్ అయినా మహానాడు అనేది ఒక ‘మాస్ జాతర’ అని అభివర్ణించారు. చంద్రబాబు నాయుడి నినాదం ‘నేషన్ ఫస్ట్’ అని చెప్తూ.. వైసీపీకి, టీడీపీకి ఉన్న తేడాను లోకేశ్ ఇలా వివరించారు:
“మాది గూగుల్.. మీది గొడ్డలి సంస్కృతి”
“మాది ఫైటర్ జెట్.. మీది ఫ్యాక్షన్ రాజకీయాలు”
“మాది రాష్ట్రానికి ‘కియా’ కార్ల పరిశ్రమ తెచ్చే విజన్.. మీది ‘కిడ్నాప్‌ల’ విధానం”
Lokesh Women Reservation | చంద్రబాబు ఇప్పటికీ జెడ్ (Z) స్పీడ్‌తో..
టీడీపీలో కార్యకర్తలే అసలైన అధినేతలని, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని లోకేశ్ కొనియాడారు. స్త్రీ శక్తిని రాజకీయాల్లో ముందుగా గుర్తించింది ఎన్టీఆరేనని గుర్తు చేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి చెప్తూ.. “ఆయనలో ముగ్గురు 25 ఏళ్ల యువకులు ఉన్నారు. ఇప్పటికీ ఆయన జెడ్ (Z) స్పీడ్‌తో పని చేస్తున్నారు. రాష్ట్రాన్ని చూసి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటే దానికి కారణం చంద్రబాబే” అని లోకేశ్ స్పష్టం చేశారు. ముందు ముందు తామే బ్యాటింగ్ చేయబోతున్నామని కార్యకర్తల్లో జోష్ నింపారు.
ఇది కూడా చదవండి: Balka Suman Comments | బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యల దుమారం.. చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం


