Assam UCC Bill | దేశంలో మూడో రాష్ట్రంగా అస్సాం.. ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Assam UCC Bill | దేశంలో ఏకీకృత పౌర స్మృతి (UCC) దిశగా మరో కీలక అడుగు పడింది. ఉత్తరాఖండ్‌, గుజరాత్‌ల తర్వాత ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన మూడో రాష్ట్రంగా అస్సాం నిలిచింది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలోని ‘ఆర్టికల్ 44’ ప్రకారం.. దేశంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టాన్ని వర్తింపజేయాలనే లక్ష్యంతో అస్సాం ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ.. యూసీసీ అమలుకు రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చామని వెల్లడించారు. ఈ చట్టం వల్ల సమాజంలో సమానత్వం వస్తుందని, ముఖ్యంగా మహిళల రక్షణ, వారి గౌరవాన్ని కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని సీఎం స్పష్టం చేశారు.

himanth

Assam UCC Bill | యూసీసీ (UCC) చట్టంలోని అంశాలు..

వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, వీలునామాల రూపకల్పన వంటి విషయాల్లో స్త్రీ, పురుషుల మధ్య ఎలాంటి వివక్ష లేకుండా లింగ సమానత్వాన్ని ఈ చట్టం సాధిస్తుంది. అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు వివాహ కనీస వయస్సు ఇకపై ఒకేలా ఉంటుంది. అన్ని మతాలలోనూ బహుభార్యత్వాన్ని , హలాల్ విధానాన్ని ఈ చట్టం పూర్తిగా నిషేధిస్తుంది. సహజీవనం చేసే జంటలు తమ వివరాలను ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనుంది.

Assam UCC Bill | సైనికులకు ప్రత్యేక వెసులుబాటు..

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో పనిచేసే రక్షణ రంగ సిబ్బంది కోసం ‘ప్రివిలేజ్డ్‌ విల్‌’ సౌకర్యాన్ని తెచ్చారు. దీని ద్వారా వారు అత్యవసర పరిస్థితుల్లో చాలా వేగంగా, సులభంగా వీలునామాను రాసుకోవచ్చు.

Assam UCC Bill | ఇది బీజేపీ రాజకీయ అజెండా..

అస్సాం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యూసీసీ బిల్లుపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత వాజెద్ అలీ చౌదరి ఆరోపించారు. బాల్య వివాహాలు, విడాకులు, భరణం, బహుభార్యత్వం వంటి సమస్యలను పరిష్కరించడానికి దేశంలో ఇప్పటికే అనేక చట్టాలు అందుబాటులో ఉన్నాయని, అలాంటప్పుడు కొత్త చట్టం తేవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యం కాదని.. గిరిజనులకు మినహాయింపు ఇచ్చిన ఈ చట్టాన్ని ‘ఏకరీతి (ఉమ్మడి) చట్టం’ అని ఎలా పిలుస్తారని ఆయన నిలదీశారు.

ucc.1

ఇది కూడా చదవండి: Petrol Price Hike | పెట్రో మంటతో సామాన్యుడు విలవిల..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *