Petrol Price Hike | పెట్రో మంటతో సామాన్యుడు విలవిల..

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Petrol Price Hike | దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల భారీగా పెరిగాయి. దీంతో కామారెడ్డి(Kamareddy) జిల్లా వాహనదారులపై కూడా తీవ్రభారం పడనుంది.

దేశంలో మే 15 నుంచి కేవలం 11 రోజుల్లో ఇది నాలుగోసారి ధరలు పెరగగా, ఈ స్వల్ప వ్యవధిలోనే లీటర్‌పై సుమారు రూ.7.50 మేర ధరలు పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో(Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.115.58, డీజిల్ ధర రూ.103.74గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఇంధన ధరలు అత్యధికంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్(Indian Oil), జియో-బీపీ, నయారా వంటి కంపెనీలకు చెందిన 110కి పైగా పెట్రోల్ పంపులు ఉన్నాయి. అందులో రూ.2లక్షల వరకు పెట్రోల్, 4 లక్షల లీటర్ల వరకు డీజిల్ అమ్మకాలు జరుగుతాయి. తాజాగా పెరిగిన ధరలతో జిల్లాలో రోజువారీ ఇంధన వినియోగం ఆధారంగా లెక్కిస్తే జిల్లా వాహనదారులపై రోజుకు సుమారు రూ.30 లక్షల మేర అదనపు భారం పడనుందని అంచనా ముఖ్యంగా రవాణా రంగం, ఆటోలు, క్యాబ్‌లు, లారీలపై ఆధారపడి జీవించే వారిపై ఈ భారం తీవ్రంగా ఉండనుంది.

Petrol Price Hike | అంతర్జాతీయ మార్కెట్​లో..

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం, రిఫైనింగ్ ఖర్చులు పెరగడంతో దిగుమతుల భారం పెరిగిందని కంపెనీలు చెబుతున్నాయి. పశ్చిమాసియా(Western Asia) ఉద్రిక్తతల కారణంగా 40శాతం క్రూడాయిల్, 90 శాతం ఎల్పీజీ దిగుమతులు ప్రభావితమయ్యాయని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా నిరంతర చమురు సరఫరా జరిగేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రభుత్వం లీటర్‌పై రూ.10కేంద్ర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం వల్ల దాదాపు రూ.14,000 కోట్ల పన్ను రాబడిని కోల్పోయిందని, అయినా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికీ రోజుకు రూ.600 కోట్లు నష్టపోతున్నాయని ఆమె వివరించారు.

Petrol Price Hike | తెలంగాణలో డీజిల్​ అమ్మకాలు..

ఇదిలా ఉండగా.. గతంతో పోలిస్తే మే నెలలో తెలంగాణలో డీజిల్ అమ్మకాలు 12.6 శాతం, పెట్రోల్ అమ్మకాలు 9 శాతం పెరిగాయి. రబీ పంటల కోతలు, ధాన్యం కొనుగోలు కార్యకలాపాల వల్ల వ్యవసాయ, రవాణా రంగాల్లో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని అధికారులు తెలిపారు. ఇంధన ధరల పెంపు నిత్యావసర సరుకుల ధరలపైనా ప్రభావం చూపుతుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంధన ఖర్చు తగ్గించుకునేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

Petrol Price Hike | పొదుపు పాటించాల్సందే..

వీలైనంత వరకు ప్రైవేట్ వాహనాల బదులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించడం మేలని చెబుతున్నారు. ఒకే కార్యాలయంలో పనిచేసే సహోద్యోగులు లేదా ఒకే రూట్‌లో వెళ్లేవారు కలిసి కార్‌పూలింగ్, బైక్‌పూలింగ్ చేయడం వల్ల ఇంధనంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని చెబుతున్నారు. వాహనాన్ని ఎప్పుడూ స్థిరమైన వేగంతో, అంటే గంటకు 40-50 కి.మీ. వేగంతో నడపడం వల్ల మైలేజీ పెరుగుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద 30 సెకన్ల కంటే ఎక్కువసేపు ఆగాల్సి వస్తే ఇంజిన్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. దగ్గర దూరాలకు వెళ్లేందుకు వాహనం కాకుండా నడక లేదా సైకిల్‌ను ఎంచుకుంటే ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా మిగులుతుంది.

Petrol Price Hike | టైర్లలో గాలి..

అలాగే టైర్లలో సరైన గాలి ఒత్తిడి ఉండేలా చూసుకోవాలి, క్రమం తప్పకుండా వాహనాన్ని సర్వీసింగ్ చేయించాలి. గాలి ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ శుభ్రంగా లేకపోయినా మైలేజీ తగ్గుతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఇంధన భారం నుంచి బయటపడాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపడమే ఉత్తమమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీలపై సబ్సిడీలు కూడా ఇస్తున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలతో నెలకు వందల రూపాయల ఇంధన ఖర్చును తగ్గించుకోవచ్చని అంటున్నారు.

deasel

ఇది కూడా చదవండి: NAAC Training | నిరుద్యోగ యువతకు న్యాక్ ద్వారా శిక్షణ: కలెక్టర్ ఇలా త్రిపాఠి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *