అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP Rajesh chandra | శాంతిభద్రతలకు సవాల్ విసిరేలా కామారెడ్డి జిల్లాలో భారీ కిడ్నాప్ కుట్ర బట్టబయలైంది. వ్యాపారిని ఎత్తుకెళ్లి రూ.లక్షలు డిమాండ్ చేయాలనుకున్న ప్లాన్‌కు తాడ్వాయి పోలీసులు (Tadwai Police) చెక్ పెట్టారు. అక్రమ తుపాకీ, రబ్బర్ బుల్లెట్లతో రెడీ అయిన ఆరుగురు కిరాతకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర (SP Rajesh Chandra) గురువారం వివరాలు వెల్లడించారు.
Kamareddy SP Rajesh chandra | పగను మనసులో ఉంచుకుని..
కామారెడ్డికి (Kamareddy) చెందిన భూసా శ్రీనివాస్ వద్ద భారీగా నగదు ఉందని పసిగట్టిన నిట్టు నర్సింగరావు ముఠా కిడ్నాప్‌కు ప్లాన్ చేసింది. పాత లావాదేవీల పగతో వీరు ఈ దుస్సాహసానికి ప్రణాళిక వేశారు. ఇందుకోసం మహారాష్ట్ర నుంచి అక్రమ తుపాకీని రూ.30 వేలకు బేరం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ.27వేలు చెల్లించారు. బుధవారం కృష్ణాజీవాడి శివాలయం దగ్గర మాటు వేసిన ముఠా.. పోలీసుల రాకతో షాక్‌కు గురైంది. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎస్సై నరేశ్ టీం.. పారిపోతున్న నిందితులను వెంటాడి పట్టుకుంది.
Kamareddy SP Rajesh chandra | అడ్డంగా దొరికిపోయి..
ఇప్పటికే హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న నిట్టు నర్సింగరావు ఈ కిడ్నాప్ (kidnap) స్కెచ్‌తో మళ్లీ అడ్డంగా దొరికిపోయాడు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సామగ్రి చూస్తే వీరి ప్లాన్ ఎంత పకడ్బందీగా ఉందో అర్థమవుతోందని ఎస్పీ తెలిపారు. ఫైర్ ఆర్మ్, 5 రబ్బర్ బుల్లెట్లు, ఎయిర్ రైఫిల్ పెల్లెట్లు, 5 సెల్‌ఫోన్లు, మంకీ క్యాప్స్, మాస్కులు, నైలాన్ తాడు, గాగుల్స్, బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన నిట్టు నర్సింగరావు, సూరం స్వామి, సంతాయిపేట్‌కు చెందిన వడ్డె స్వామి, పులి ప్రశాంత్ గౌడ్, మహారాష్ట్రకు చెందిన తుపాకీ సప్లయర్స్ వైభవ్ ప్రకాశ్, అజయ్ గోంగపాలేలను అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మారుతి మోకే కోసం గాలిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. నిందితులపై ఆర్మ్స్ యాక్ట్, బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఆయన తెలిపారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్సై నరేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Splendor Xtec 2.0 | హీరో నుంచి సూపర్ స్ల్పెండర్ ఎక్స్‌టెక్ 2.0..


